ఎన్నికలు ఉంటేనే దళితులు గుర్తొస్తారా..?

by  |
madu-yashki
X

దిశ, కామారెడ్డి : సీఎం కేసీఆర్ దళితుల పేరుతో దగా చేస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. టీపీసీసీ మెంబర్‌గా బాధ్యతలు స్వీకరించాక మొట్టమొదటి సారి నిజామాబాద్ జిల్లాకు వెళ్తున్న మధుయాష్కీ గౌడ్‌కు కామారెడ్డి టెక్రియల్ బైపాస్ వద్ద ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో తెలంగాణ సాధించుకుంటే దళితున్ని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఆయనే సీఎం పీఠంపై కూర్చుని దళితులను మోసం చేశారన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి దళితుల పేరుతో కేసీఆర్ దగా చేస్తున్నారని, ఇంకా మోసం చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్‌ను రాజకీయంగా బొంద పెట్టినప్పుడే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు.
రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పేరుతో గెలిచిన ఎమ్మెల్యే కోట్లకు అమ్ముడుపోయారని విమర్శించారు. డబ్బులిచ్చి, కష్టపడి గెలిపించిన ప్రజలను మోసం చేశారన్నారు. కామారెడ్డి జిల్లాలో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయినా జిల్లా మంత్రి గానీ, జిల్లాకు చెందిన స్పీకర్ గానీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రైతులకు మళ్ళీ కష్టాలు తప్పుతాయని చెప్పారు.

రాష్ట్రంలో దోపిడి పాలన..

తెలంగాణలో దోపిడీ పాలన కొనసాగుతోందని తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రాజెక్టులు, కాంట్రాక్టుల పేరుతో విచ్చలవిడిగా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ దోపిడీ ప్రభుత్వానికి నూకలు చెల్లే తరుణం ఆసన్నమైందని తెలిపారు. సోనియాగాంధీ నేతృత్వంలో తెలంగాణ వస్తే కేసీఆర్, కేటీఆర్, కవితలు సోకులు చేసుకుంటున్నారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో 65 వేల కోట్ల అప్పుంటే ఇప్పుడు మూడున్నర లక్షల కోట్లు అప్పుచేసి దోచుకుంటున్నారని ఆరోపించారు. దుబారా ప్రభుత్వం ఇంకా ఎన్నాళ్ళో సాగదని, తాము అధికారంలోకి వస్తున్నామని, అవినీతిని బయటకు తీస్తామని చెప్పారు.

-తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్

Next Story

Most Viewed