పైసలు పంచితే గుంజుకోండి.. ఓటు మాత్రం ఆలోచించి వేయండి : రేవంత్ రెడ్డి

by  |
పైసలు పంచితే గుంజుకోండి.. ఓటు మాత్రం ఆలోచించి వేయండి : రేవంత్ రెడ్డి
X

దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ ఉపఎన్నికకు నేటితో ప్రచారం ముగిసింది. స్థానికేతర నాయకులు ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు నియోజకవర్గం నుంచి వెళ్లిపోయారు. అంతకుముందు నియోజకవర్గంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓట్ల కోసం డబ్బులు పంచితే గుంజుకోండని అన్నారు. నిన్నటివరకు ఈటల కూడా కేసీఆర్ ఇంటి మనిషేనని, ఆయన కత్తితో మన కడుపులో పొడిచినోడేనని ఇద్దరి మధ్య పంపకాల పంచాయితీ వల్లే ఉపఎన్నికలు వచ్చాయన్నారు.

విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ గురించి గానీ, ఉద్యోగాల భర్తీ గురించి కానీ మాట్లాడవా అంటూ కేసీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. వరి వేస్తే ఉరేనని.. సన్నాలు సాగు చేసుకోండని చెప్పి, వేసిన సన్నాలను కొనలేని సన్నాసి కేసీఆర్ అంటూ మండిపడ్డారు. మా పొలంలో వరి తప్పా ఏం పండదు.. ఏం చేయాలో చెప్పాలని టీపీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. రూ.120 కోట్లు పంచిపెట్టి ఓట్లు కొనాలని టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తోందని.. బీజేపీ కూడా ఇంకో వంద కోట్లు ఖర్చు చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ ఇంకో ముప్పై ఏండ్లు మీ కోసం పని చేస్తాడన్న విషయం గుర్తు పెట్టుకోవాలని, మీ కోసం పోరాడే వాడిని గెలిపించాలన్నారు. నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్ మొహం చూపించలేక ఇక్కడకు రాలేదన్నారు.

Next Story

Most Viewed