భారత మార్కెట్లో 'యారిస్' మోడల్ కారును నిలిపేసిన టయోటా సంస్థ

by  |
భారత మార్కెట్లో యారిస్ మోడల్ కారును నిలిపేసిన టయోటా సంస్థ
X

దిశ, వెబ్‌డెస్క్: తక్కువ అమ్మకాల కారణంగా ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా భారత మార్కెట్లో తన సెడాన్ మోడల్ యారిస్‌ను నిలిపేస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. దీనికి సంబంధించి పరిశ్రమలో ఎప్పటినుంచో చర్చ కొనసాగుతున్నప్పటికీ సోమవారం అధికారికంగా సంస్థ ప్రకటించింది. ఇప్పటివరకు టయోటా సంస్థ కేవలం 237 యారిస్ మోడల్ కార్లను మాత్రమే తయారు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత ఒక్క యూనిట్‌ను కూడా ఉత్పత్తి చేయలేదు. ఇటీవల మారుతున్న టెక్నాలజీ, పెరుగుతున్న ఫీచర్లను పరిగణలోకి తీసుకుని వినియోగదారుల అవసరాలను తీర్చే ఉత్పత్తి వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే సమయంలో రానున్న 10 ఏళ్ల వరకు యారిస్ మోడల్ కలిగిన వినియోగదారులకు విడిభాగాలను సరఫరా చేస్తామని కంపెనీ స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఈ విభాగంలో హోండా సిటీ, హ్యూండాయ్ వెర్నా మెరుగ్గా రాణిస్తున్నాయి. గత రెండేళ్ల కాలంలో టయోటా సంస్థ నిలిపేసిన మూడో మోడల్ కారు యారిస్ కావడం విశేషం. గతేడాది ఏప్రిల్‌లో బీఎస్6 ఉద్గార నిబంధనల కారణంగా కొరొలా ఆల్టిస్, ఇటియోస్ కార్లను కూడా నిలిపేసింది. అధిక పెట్టుబడుల స్థాయిలో అమ్మకాలు లేని కారణంగా కంపెనీ ఈ రెండు మోడళ్లను కొత్త ఉద్గార నిబంధలకు అప్‌గ్రేడ్ చేయలేదు.



Next Story