బండారం బయటపడుతుందనే సస్పెన్షన్.. మాజీ మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
బండారం బయటపడుతుందనే సస్పెన్షన్.. మాజీ మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మీ బండారం బయట పడుతుందనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? అని కేసీఆర్ ను మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. సీఎం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లోని హైదర్ గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎదుట సోమవారం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి బయటకు రావడం సంతోషంగా ఉందన్నారు. ‘నా రాష్ట్రం.. నా ఇష్టం’ అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సాధనలో అందరి పాత్ర ఉందని గుర్తు చేశారు. మా ఇంట్లో ఎవరి ఫొటోలు ఉండాలో నిర్ణయించేది వాళ్లెవరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లుగా సభ్యత్వాలు ఇవ్వకపోయినా కేసీఆర్ ఫొటో మా ఇంట్లో ఉందన్నారు. దీంతోపాటు రాజశేఖర్ రెడ్డి ఫొటో కూడా ఉందన్నారు.

గత ఎన్నికల్లో ఓటమికి పార్టీ పెద్దలే కారణమని ఆరోపించారు. ప్రశ్నించే గొంతులు పార్టీ లేకుండా చేస్తున్నారన్నారు. ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవకతవకలపై ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వడన్నారు. కొల్లాపూర్ నియోజక వర్గంలో ఉద్యమకారుల మీద అనేక కేసులు పెట్టారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బూత్ లో జూపల్లి మనుషులు కూర్చోవద్దనే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజాస్వామ్యం నిలబడాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. తన భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.

ప్రెస్ మీట్ కు నో పర్మీషన్

హైదర్ గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే నివాస గృహ సముదాయంలో జూపల్లి మీడియా సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా ప్రెస్ మీట్ నిర్వహించేందుకు జూపల్లిని రాగా, ఆయనను అడ్డుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. అనంతరం జూపల్లి హైదర్ గూడ మెయిన్ రోడ్డు పక్కన మీడియా సమావేశం నిర్వహించారు.

Next Story