ఏపీలో పెట్రోల్ రేట్‌ను క్రాస్ చేసిన టమోటా..

by srinivas |   ( Updated:2021-11-23 06:19:42.0  )
tamato
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రస్తుత రోజుల్లో టమోటా కూరలేని ఇల్లు, టమాటో లేని దుకాణం ఊహించడమే కష్టం. అంతేకాదు టమోటా చట్నీ లేని హోటల్స్ కూడా మనకు కనిపించవు. ఆరోగ్యానికి మేలు చేసే ఈ టమోటాను ప్రతీ ఒక్కరూ తమ కూరలోనో..ఫాస్ట్‌ఫుడ్‌లోనో వినియోగించడం తప్పనిసరి. అలాంటి టమోటా ఇప్పుడు సామాన్యుడిని హడలెత్తిస్తుంది. కొనాలంటేనే భయపడేలా చేస్తోంది టమోటా. ప్రస్తుతం టమోట రేట్లు మార్కెట్లలో ఠారెత్తిస్తున్నాయి. టమోటాను కొనడమే ఒక సాహసంగా ప్రజలు భావిస్తున్నారంటే ధరలు ఎంతలా పెరిగాయో ఇట్టే అర్థమవుతుంది. ప్రస్తుతం ఏపీలో కిలో టమోటా ధర రూ.130 వరకు చేరింది. టమోటా ధరను చూసి వినియోగదారులు వామ్మో అంటున్నారు. పెట్రోల్ రేటును దాటేసిందంటున్నారు.

రెండు నెలల్లో పదిరెట్లు పెరిగిన ధరలు

గత వారం రోజులుగా మార్కెట్లో టమోటా ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో హోటళ్లలోనూ టమోటా వినియోగాన్ని తగ్గించేశారు. అంతేకాదు మరికొన్ని హోటల్స్‌లో టమోటా వెరైటీలకు ఎక్స్ ట్రా చార్జీలు సైతం వేసేస్తున్నాయి. టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు సైతం టమాట చట్నీకి గుడ్ బై చెప్పేశారు. టమోటాను కొనేటట్టే లేకపోవడంతో టమోటా చట్నీకి విరామం పలికేశారు. టమోటా కొనేదానికన్నా ఇతర కూరగాయలు కొనుగోలు చేస్తే బెటర్ అని కొందరు ఆకుకూరలు కొనుగోలు చేస్తున్నారు. రెండు నెలల క్రితం వరకు కిలో టమాట రూ.10 ఉండగా.. ఇప్పుడు ఏకంగా 10 రెట్లు పెరిగి సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంది. భారీ వర్షాలు పడడం, ట్రాన్స్ పోర్ట్‌కు ఇబ్బందులు తలెత్తడంతో టమోటా దిగుమతి కాలేదు. దీంతో ధరలకు రెక్కలొచ్చాయి.



Next Story