మౌనమేలా.. ఉద్యోగ సంఘాలకు అసలేమైంది..?

by  |
mpdo-issue
X

దిశ, తెలంగాణ బ్యూరో : అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అధికారులపై ఎంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా కనీసం ఖండించేందుకు కూడా ఉద్యోగ సంఘాలు ముందుకు రావడం లేదు. స్వరాష్ట్రంలో ఉద్యోగులకు గౌరవం పెరుగుతుందనుకుంటే కనీసం మర్యాదగా పని చేసే పరిస్థితి కూడా లేదంటూ ఉద్యోగవర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నతస్థాయిలో ఉద్యోగ సంఘాల తీరుతోనే ఈ పరిస్థితి అంటూ విమర్శలు చేస్తున్నారు. అటు ఉద్యోగ సంఘాల తీరు కూడా అదే విధంగా ఉంటోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలో, ప్రతిపక్ష నేతలో ఏదైనా అంటే చాలు విధులను బహిష్కరించి రోడ్డెక్కుతున్న ఉద్యోగులు… అధికార పార్టీ నేతలు మాత్రం భయంతో వణుకుతున్నారు. కనీసం వారిని ఎందుకు అంటున్నారని ప్రశ్నించే సాహసం కూడా చేయలేకపోతున్నారు.

భయమా.. ప్రలోభమా…?

కానీ చిన్న చిన్న సమస్యలకే విధులను పక్కన పెట్టి నిరసనకు దిగే ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ప్రభుత్వం ఎదుట తలొగ్గుతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఓ మహిళా ఎంపీడీఓపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రమంతా చర్చనీయాంశమయ్యాయి. మహిళా ఉన్నతాధికారిని నిండు సభలో చులకన చేయడమే కాకుండా… అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కొన్నిచోట్ల మహిళా సంఘాలు నిరసనకు కూడా దిగాయి. కానీ ఉద్యోగ సంఘాలు మాత్రం కనీసం దానిపై నోరెత్తడం లేదు. తప్పు అనే ప్రకటన కూడా విడుదల చేయడం లేదు. ఉద్యోగ సంఘాలు కేసీఆర్​ వలలో చిక్కాయనే ఆరోపణలు చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలకు కేసీఆర్​ భయం పట్టుకుందని సెటైర్లు వేస్తున్నారు. ఇక మరికొంతమందికి పదోన్నతులు తదితర ప్రలోభాల్లో పెట్టారని, ఉద్యోగ సంఘాల గుట్టు కేసీఆర్​ చేతిలో ఉండటంతోనే మౌనంగా ఉంటున్నారనే విమర్శలు చేస్తున్నారు.

అధికారి తెలియకుండానే చనువా..?

ఎంపీడీఓ అధికారుల సంఘం ఈ ఘటనను సమర్ధించుకునే ప్రయత్నాలు చేస్తోంది. మంత్రికి, సదరు అధికారికి చనువు ఉందంటూ మంత్రిని కాపాడే ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఆ వీడియోలో మాత్రం అక్కడ ఎంపీడీవో ఎవరో అప్పటివరకు మంత్రి తెలియనట్టే మాట్లాడారు. “ ఎంపీడీఓ ఎవరయ్యా అంటే… పక్కన ఉన్న వారు మేడం..మేడం.. అంటూ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. అంటే అక్కడి ఎంపీడీఓ ఎవరో తెలియకుండానే మంత్రికి చనువు ఉందంటూ మంత్రిని వెనకేసుకు రావడమెందుకనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సదరు మహిళా అధికారి… మంత్రి వెనక ఉండటంతో వెనక్కి చూసిన మంత్రి ఆ వ్యాఖ్యలు చేశారు. దీనిపై పలువురు ఉద్యోగులు సోషల్​ మీడియాలో ఇదే ట్రోల్​చేస్తున్నారు.

మహిళా నేతలు కూడా స్పందించరా..?

రాష్ట్రంలోని కీలకమైన ఉద్యోగ సంఘాలు దీనిపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు. అటు టీజీఓలో ఎంపీడీఓ అసోసియేషన్​ భాగంగా ఉంది. అదే టీజీఓకు అధ్యక్షురాలిగా మమత కొనసాగుతున్నారు. ఒక సంఘానికి మహిళాధ్యక్షురాలిగా ఉన్న మమత… మహిళాధికారికి జరిగిన ఈ సంఘటనపై కనీసం నోరెత్తకపోవడంలో ఆంతర్యమేమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగ సంఘాల ముసుగులో వారి పదవులు, పదోన్నతులు, పోస్టింగ్​లను తెచ్చుకుంటున్నారని, అంతేకానీ ఉద్యోగులను పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా దీనిపై వివరణ ఇచ్చేందుకు కూడా మమత మీడియాకు ముఖం చాటేస్తున్నారు. మరోవైపు ఎంపీడీఓ అసోసియేషన్​ కూడా ఎలాంటి ప్రకటన వద్దంటూ సైలెంట్​గా ఉంటోంది. ఎంపీడీఓ అసోసియేషన్​ కూడా ఈ విషయంపై మాట్లాడటం లేదు. ఇక ఉద్యోగ సంఘాల జేఏసీ నుంచి కూడా అంతే.

“ 2008లో వరంగల్ జిల్లా పాలకుర్తి మండలంలోని పీహెచ్సీలో ఓ వైద్యాధికారి… అక్కడే ఓ నర్సుపై అసభ్య కామెంట్స్​చేశారని తెలంగాణ ఉద్యోగ సంఘాలు గళమెత్తాయి. సదరు మెడికల్​ఆఫీసర్‌ను సస్పెండ్​చేసే వరకూ ఆందోళన చేశారు.

“2018, మార్చి 25న నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వరంగల్​కలెక్టర్​హరిత సరిగా పనిచేయడం లేదని, కలెక్టర్‌ను ఉద్దేశించి ఆమె ‘‘ఎలోడు పని చేసినట్లు చేస్తుందిగా’’ అని కామెంట్ చేశారని ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పే వరకూ నిరసనకు దిగారు. (అప్పుడు దొంతి మాధవరెడ్డి ప్రతిపక్ష కాంగ్రెస్​పార్టీ అనుబంధ ఎమ్మెల్యే)

“ 2019, ఆగస్టు 31న టీఎస్‌జెన్​కో, ట్రాన్స్​కో సీఎండీ ప్రభాకర్​రావుపై ఎంపీ రేవంత్​రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగులు, విద్యుత్​కార్మిక సంఘాలు నిరసన చేశారు. (కాంగ్రెస్​ పార్టీ ఎంపీ)

2019, నవంబర్​5న తహసీల్దార్‌ విజయా రెడ్డి హత్యపై రెవెన్యూ, ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. హత్య వార్త తెలిసిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా విధులను బహిష్కరించిన రెవెన్యూ ఉద్యోగులు ఎక్కడికక్కడ ఆందోళనలు వ్యక్తం చేశారు. మానవహారాలు, కొవ్వొత్తులతో ర్యాలీలు చేపట్టారు. నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. పలుచోట్ల రెవెన్యూ కార్యాలయాలకు తాళాలు వేసి నిరసన తెలిపారు.” (ప్రైవేట్ వ్యక్తి దాడి).

“ తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు… మహిళా అధికారిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా… ఉద్యోగ సంఘాలు మాత్రం నోరెత్తడం లేదు. ఎందుకంటే ఆయన అధికార పార్టీ… అందులోనూ మంత్రి.”

Next Story

Most Viewed