అమెరికన్లలో ఇమ్యూనిటీ పెంచుతున్న ‘రసం’

by  |
అమెరికన్లలో ఇమ్యూనిటీ పెంచుతున్న ‘రసం’
X

దిశ, వెబ్‌డెస్క్: పాండమిక్ టైమ్‌లో ఆయుర్వేద ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. వంటల్లో పసుపు, మిరియాలు, అల్లం, వెల్లుల్లి, శొంఠిల వినియోగం పెరిగింది. పూర్వీకులు అవలంభించిన పద్ధతులను అనుసరించేందుకు ప్రస్తుతం భారతీయులు ట్రై చేస్తున్నారు. అప్పటి కషాయాలకు డిమాండ్ పెరిగింది. కొవిడ్ వైరస్ నేపథ్యంలో ఇమ్యూనిటీ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికీ అవసరం. భారతీయ ‘రసం’ అమెరికా ప్రజలకు ఇమ్యూనిటీ బూస్టర్‌గా మారింది. అక్కడ ‘వైరల్ ట్రెండ్’ను సృష్టించిన ‘రసం’ రుచుల ఘుమఘుమలు తెలుసుకుందాం.

రసంలో చాలా రకాలున్నాయి. ఎన్ని రకాలున్నా ‘వెల్లుల్లి’, ‘అల్లం’, మిరియాల పొడి, పసుపు మాత్రం రసం తయారీలో కామన్‌గా ఉపయోగిస్తాం. ఇండియాలో కొవిడ్ పేషెంట్స్‌తోపాటు, అందరూ కూడా వీటిని విరివిగా ఉపయోగించి తమ ఇమ్యూనిటిని పెంచుకున్నారు. అమెరికాలో ఇప్పటికీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలోనే తమిళనాడుకు చెందిన చెఫ్ అరుణ్ రాజదురై న్యూజెర్సీ కొవిడ్ పేషెంట్లకు మన ‘రసం’ రుచి చూపిస్తూ, వారిలో ఇమ్యూనిటీ పెంచుతున్నాడు. మూడు ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు అరుణ్ దురైనే ఫుడ్ సప్లయ్ చేస్తున్నాడు. మన ‘రసం’లోని ఇన్‌గ్రేడియంట్స్ ఇమ్యూనిటీ బూస్టర్స్‌గా పనిచేస్తాయనే ఆలోచనతో అరుణ్, కొవిడ్ పేషెంట్స్‌కు ‘కాంప్లిమెంటరీ డిష్’గా రసాన్ని అందించాడు.

ఆ తర్వాత ఫీడ్‌బ్యాక్ పాజిటివ్‌గా రావడంతో, రసానికి డిమాండ్ పెరిగింది. దాంతో అరుణ్ పనిచేసే ‘అంజప్పార్ ప్రిన్స్‌టన్‌’ హోటల్ మెనూలో ‘రసం- ఇమ్యూనిటీ బూస్టింగ్ సూప్’కు సూపర్ డిమాండ్ పెరిగింది. దాంతో న్యూయార్క్, న్యూజెర్సీ, కెనడాల్లోని తమ హోటల్ బ్రాంచెస్‌లో ‘రసా’న్ని ఇంట్రడ్యూస్ చేశారు. రోజూ 500-600 కప్పులు రసం అమ్ముడుపోతున్నట్లు హోటల్ నిర్వాహకులు తెలిపారు. ‘రసానికి ఇంత గొప్ప రెస్పాన్స్ వస్తుందని నేను ఊహించలేదు. తిరుచిలో హోటల్ మేనేజ్‌మెంట్ స్టడీ చేశాను. 2018లో బెస్ట్ సౌత్ ఈస్ట్ ఆసియన్ చెఫ్ అవార్డు అందుకున్నాను. కొవిడ్ బాధితులకు నేను అందిస్తున్న రసం, వారి ఆరోగ్యం బాగు చేయడంలో ఉపయోగపడుతుంటే ఆనందంగా ఉంది’ అని అరుణ్ వివరించాడు.
రసం ఎలా పుట్టిందంటే ?
తమిళ పదం ‘ఇరసం’, సంసృతంలోని ‘రస’ పదాల కలయిక నుంచి ‘రసం’ పుట్టింది. 16వ శతాబ్దంలో మధురైలో ఉండే సౌరాష్ట్రీయులు దీన్ని మొదటగా ఉపయోగించినట్లు తెలుస్తోంది. వాళ్లు దీన్ని ‘పులిచార్’గా పిలిచేవాళ్లు. చింతపండు చారు అన్న మాట. సౌత్ ఇండియాలో రసాన్ని చాలా రకాలుగా పిలుస్తారు. కర్ణాటకలో సారు, ఆంధ్ర, తెలంగాణలో చారు, రసం, మహారాష్ట్రలో సార్‌గా పిలుస్తారు. రసంలో దాదాపు 200 రకాలున్నాయి. ఈ రసాల టెక్చర్, ఫ్లేవర్లలో చిన్నపాటి మార్పులుంటాయంతే.

Next Story