2020 టాప్‌లో ‘టిక్‌టాక్’

by  |
2020 టాప్‌లో ‘టిక్‌టాక్’
X

దిశ, వెబ్‌డెస్క్: రోజుకో కొత్త యాప్ మార్కెట్‌లో విడుదలవుతూనే ఉన్నా, డౌన్‌లోడ్స్‌లో ఈ ఏడాది కూడా ప్రముఖ యాప్స్ టాప్‌లో నిలవడం విశేషం. 2019లో ఫేస్‌బుక్‌కు చెందిన ‘మెసెంజర్ యాప్’ అత్యధిక డౌన్‌లోడ్స్‌తో టాప్‌లో నిలవగా, ఈ ఏడాది మాత్రం ఆరో స్థానాన్ని పొందింది. ఇక ప్రముఖ షార్ట్ వీడియో యాప్ ‘టిక్‌టాక్’పై భారత ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ, ఈ యాప్‌నకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అంతేకాదు 2020లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది డౌన్‌లోడ్స్ చేసిన యాప్‌గా మొదటి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించినట్లు టెక్నికల్ అనలిటికల్ సంస్థ యాప్ అన్నీ(app annie) తాజా సర్వేలో వెల్లడించింది. ఇవేకాక 2020 టాప్ డౌన్‌లోడెడ్ యాప్స్ జాబితాలో ఏ యాప్స్ నిలిచాయంటే?

కరోనా కారణంగా ఈ ఏడాది భిన్నమైన పరిస్థితులు ఎదురవడంతో పాటు అందరూ చాలాకాలం లాక్‌డౌన్‌లో ఉండిపోయారు. దీంతో మొబైల్ వినియోగం విపరీతంగా పెరిగి, యాప్ డౌన్‌లోడ్స్‌ కూడా పెరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లు ఉపయోగించే గూగుల్ ప్లే స్టోర్ డౌన్‌లోడ్స్, ఐఓఎస్ యూజర్లు ఉపయోగించే ఆపిల్ స్టోర్ డౌన్‌లోడ్స్ కంటే 160 శాతం పెరిగిట్లు నివేదికలో వెల్లడైంది. అయితే, 2020 ఏడాదిలో ఈ రెండు యాప్ స్టోర్ల ద్వారా 10 శాతం డౌన్‌లోడ్స్ పెరిగాయని నివేదిక పేర్కొంది. ఇక కొవిడ్ ప్రత్యేక పరిస్థితుల కారణంగా వీడియో యాప్స్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. 2019తో పోల్చితే జూమ్, గూగుల్ మీట్‌‌ పాటు మైక్రో వీడియో ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌లు 2020లో ఎక్కువ డౌన్‌లోడ్స్ సాధించాయి. జూమ్ ఏకంగా 219 స్థానాలు మెరుగుపడగా, టెలిగ్రామ్ పది స్థానాలు ఎగబాకింది.

ఇక 2020లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది యూజర్లు డౌన్‌లోడ్ చేసిన యాప్‌గా టిక్‌టాక్ నిలిచి రికార్డు సృష్టించగా, 2021లోనూ ప్రపంచవ్యాప్తంగా సగటున 1.2 బిలియన్ల నెలవారీ యాక్టివ్‌ యూజర్స్‌ను టిక్‌టాక్ కలిగి ఉంటుందని నివేదిక అంచనా వేసింది. యాప్ అన్నీ నివేదికలో ఫేస్‌బుక్ రెండో స్థానంలో, ఇన్‌స్టాగ్రామ్ మూడు, వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్ నాలుగో స్థానంలో, వాట్సాప్ ఐదో స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో టిండెర్, టిక్‌టాక్, యూట్యూబ్, డిస్నీ +, టెన్సెంట్ వీడియో యాప్స్ కూడా ఉన్నాయి.



Next Story

Most Viewed