అదిగో పులి.. ఇదిగో అడుగు

by  |
అదిగో పులి.. ఇదిగో అడుగు
X

దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో పెద్ద పులుల సంచారం కలకలం రేపుతోంది. కవ్వాల్ టైగర్ జోన్ కోర్, బఫర్ ప్రాంతాలతో సంబంధం లేని ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తూ ఉండడం ఆందోళన కల్గిస్తోంది. అయితే పెద్దపులి ఒక్కటే ఉన్నదా..? అంతకన్నా ఎక్కువ ఉన్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై అటవీశాఖ అధికారులు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

రోజుకో చోట కనిపిస్తున్న పులి

సింగరేణి బొగ్గు గనుల ఏరియాల్లో పెద్దపులి రోజుకో చోట కనిపిస్తుంది. 15 రోజుల వ్యవధిలోనే పెద్దపులి నాలుగు చోట్ల కనిపించింది. ఈ విషయాన్ని అటవీ అధికారులు కూడా ధృవీకరించారు. నెన్నెల మండలంలో తొలుత కనిపించిన పులి, ఆ తర్వాత ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గోలేటి ప్రాంతంలో సంచరించినట్లు అటవీ అధికారులు గుర్తించారు. తాజాగా రెండు రోజుల క్రితం మంచిర్యాల జిల్లా మందమర్రి ఓపెన్ కాస్ట్ కేకే-5 గని వద్ద తిరిగిన పెద్ద పులి.. తాజాగా జిల్లాలోని శ్రీరాంపూర్ ప్రాంతంలో గురువారం సింగరేణి కార్మికులకు కనిపించింది. వివిధ ప్రాంతాల్లో కనిపించిన పెద్దపులి అడుగుల గుర్తులను అటవీ అధికారులు సేకరిస్తున్నారు. వీటి ఆధారంగా కోల్ బెల్ట్ ప్రాంతంలో తిరుగుతున్న పెద్దపులి ఒక్కటేనా..? అంతకన్నా ఎక్కువగా ఉన్నాయా..? అని నిర్ధారించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Next Story