పాట పాడితే.. క్యాబ్ రైడ్ ఫ్రీ

by  |
పాట పాడితే.. క్యాబ్ రైడ్ ఫ్రీ
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రయాణంలో చాలామందికి పాటలు వినే అలవాటు ఉంటుంది. అందుకే బస్సుల్లో, ఆటోల్లో, చివరకు క్యాబ్స్‌లో‌ కూడా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా మ్యూజిక్ సిస్టమ్స్ అమరుస్తారు. ఇంకాస్త అడ్వాన్స్‌గా ఇటీవలి కాలంలో క్యాబ్స్‌లో ట్యాబ్‌లు అమర్చడంతో పాటు, కస్టమర్లే తమకు ఇష్టమైన పాటలు పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నారు. అయితే క్యాబ్‌లో ప్రయాణిస్తూ పాటలు హమ్ చేసే బదులు.. ఆ పాటను మనమే పాడితే? అందుకు ఫ్రీ క్యాబ్ రైడ్‌తో పాటు క్యాష్‌బ్యాక్ ప్రైజ్ కూడా లభిస్తే? సూపర్‌గా ఉంటుంది కదా! అలాంటి అద్భుతమైన ఆఫర్‌ను ఓ క్యాబ్ డ్రైవర్.. నిజంగానే అందిస్తుండటం విశేషం.

పాటలంటే ఎంతో ఇష్టపడే తైవాన్ ప్రజలు.. ప్రయాణానికి ఎక్కువగా కరోకే ట్యాక్సీలనే ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే.. ఆ క్యాబ్‌లో ఎక్కితే అసలు ప్రయాణమే తెలియదు, ఫుల్ వాల్యూమ్‌లో పాటలు పాడుతూ జర్నీని ఆసాంతం ఆస్వాదించొచ్చు. అందులో పాటలు పాడొచ్చు, వినొచ్చు కూడా. కాగా తైవాన్‌కు చెందిన ట్యాక్సీ డ్రైవర్ ‘చింగ్ లియాంగ్‌’కు కూడా సంగీతమంటే ప్రాణం. అందుకే తన ఇష్టంతో పాటు, తైవాన్ ప్రజల మనసు తెలుసుకున్న లియాంగ్.. తన ట్యాక్సీలో ఎక్కే ప్రయాణికులు ఒక పాట పాడితే చాలు. ఫ్రీ రైడ్‌తో పాటు అద్భుతంగా పాడినవాళ్లకు క్యాష్ బ్యాక్ కూడా అందిస్తున్నాడు.

27 ఏళ్ల నుంచి ట్యాక్సీ నడుపుతున్న లియాంగ్.. ఎనిమిదేళ్ల కిందటి నుంచి ‘ఫ్రీ సింగింగ్ రైడ్ సర్వీస్’ అందిస్తుండగా, ప్రయాణికుల అనుమతితో వాటిని వీడియోలు తీయడాన్ని ఆరేళ్ల క్రితం ప్రారంభించాడు. ఆ వీడియోలను తన యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడంతో ఎంతోమంది లోకల్ సింగర్స్ పాపులర్ అయ్యారు. ఇప్పటివరకు లియాంగ్ తన చానల్‌లో పదివేలకు పైగా వీడియోలు అప్‌లోడ్ చేయగా, వేలాదిమంది ఆయన చానల్‌ను సబ్‌స్కైబ్ చేశారు. ఇప్పటికే పది దేశాలకు చెందిన వివిధ చానెల్స్ తనను ఇంటర్వ్యూ చేయగా, లియంగ్ తనొక ‘ఇంటర్నేషనల్ ఇన్‌ఫ్ల్యూయెన్సర్‌ అని భావిస్తుంటాడు. తైవాన్‌లో మినీ సెలెబ్రిటీగా మారిన ఆయన.. దివ్యాంగుల కోసం తన క్యాబ్‌లో వీల్ చెయిర్ సర్వీస్ కూడా అందిస్తున్నాడు.


Next Story