భయం భయం.. అప్పుడు స్కైలాబ్‌, ఇప్పుడు కరోనా!

by  |
భయం భయం.. అప్పుడు స్కైలాబ్‌, ఇప్పుడు కరోనా!
X

దిశ, కరీంనగర్: స్కైలాబ్ పడ్డ రోజుల్లో కూడా ఇప్పటి మాదిరిగానే ప్రజలు జీవనం సాగించారా? ఇప్పటిలాగే ఆందోళనతో రోజులు వెళ్లదీశారా? అసలు అప్పుడేం జరిగిందో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీని చదవాల్సిందే.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మానవ తప్పిదం వల్ల నియంత్రణ కోల్పోయి గతి తప్పిన ఓ ఉపగ్రహ శకలం భూవాతావరణంలోకి ప్రవేశించింది. 1979 జూలై 11 న సముద్రంలో పడి విచ్ఛిన్నం అయిన ఆ శకలం ప్రజలను మూడు వారాలపాటు భయపెట్టింది. నాలుగు దశాబ్దాల క్రితం స్కైలాబ్ పడుతోందన్న నాటి రోజులకు, కరోనా వ్యాధి ప్రబలుతున్న ఇప్పటి రోజులను గ్రామాల్లో ప్రజలు పోల్చుకుంటున్నారు. తాము చనిపోవడం ఖాయమని భావించిన చాలామంది మేకలు, గొర్లు, కోళ్లు కోసుకుని వండుకుని తిన్నారు. ఆస్తులు ఎక్కువగా ఉన్నవారు తక్కువ ధరకే అమ్ముకోగా, కొంతమంది తమ జీవితాలు ముగియబోతున్నాయని స్థిరాస్తులను దానం చేశారు.

ఇంటి తలుపులకు పేడ పూసి…

స్కైలాబ్ పడిన ఇళ్లలో ఉంటున్నందున దాని ప్రభావం పడకుండా ఉండేందుకు కొన్ని రక్షణ చర్యలు కూడా తీసుకున్నారు. పేడను ఇంటి తలుపులకు పూసి గ్యాప్ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

స్కైలాబ్ తమ గ్రామాల సమీపంలో పడినా.. దాని ద్వారా వచ్చే విషవాయువులు ఇళ్లలోకి చొరబడవద్దని ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. చివరకు స్కైలాబ్ పడుతుందన్న రోజు రాగానే గ్రామగ్రామాన దండోరా వేయించి ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రచారం చేశారు. మరునాడు బతికుంటామో లేదా అన్న ఆందోళనతోనే ఎవరి ఇళ్లలో వారు తెల్లవార్లూ నిద్రపోకుండా ఉండిపోయారు.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా…

ఇప్పుడు కరోనా వైరస్ ఒకరి నుండి ఒకరికి సోకే ప్రమాదం ఉందని సామాజిక దూరం పాటించాల్సిన పరిస్థితి వచ్చింది. లాక్‌డౌన్ అమలు చేస్తుండడంతో ఇళ్లకే పరిమితం అయినా నేటి సమాజం ఈ వైరస్ ఎలా సోకుతుందో అర్థంకాక సతమతమవుతున్నారు. నెలరోజులు దాటినా కూడా వైరస్ నియంత్రణలోకి రాకపోవడం ఆందోళన కల్గిస్తున్న అంశం. స్కైలాబ్ పడి చనిపోతామన్న ఆందోళనతో అప్పుడు ఒక చోటకు చేరి కలివిడిగా ఉంటే ఇప్పుడు ఎవరికి వారే అన్నట్టుగా జీవించాల్సి వస్తోంది. స్కైలాబ్ పడిపోయిన ప్రాంతానికే ప్రాణహానీ ఉంటుందని తెలిసినా అది ఎక్కడ పడుతుందో తెలియక అందరూ చనిపోతామని మానసికంగా సిద్ధమైపోయారు. కానీ, కరోనా ఎలా సోకుతుందో అంతుచిక్కక క్షణక్షణం భయం భయం అన్నట్టుగా జీవించాల్సిన పరిస్థితి తయారైంది.

స్కైలాబ్ పడేరోజు తెలుసు…

‘స్కెలాబ్ పడుతుందన్న భయం మాలో ఉన్నా అది ఏ రోజు పడుతుందో రేడియో ద్వారా తెలిసింది. అది మా ఊర్లపై పడితే చస్తామని అనుకున్నాం. కానీ, అప్పటివరకు మాత్రం ఊరోళ్లందరం కలిసి ముచ్చట పెట్టుకునేటోళ్లం. పిల్లా, జెల్లా అందరం ఇంటి దగ్గరే ఊండి రోజులు గడిపాం. స్కెలాబ్ పడితే చస్తాం లేకుంటే బతుకుతామనుకున్నాం. మా ఊరికి చెందిన మల్లయ్య అనే పెద్దమనిషి రేడియో వార్తలు విని తెల్లవారు జామున రెండు గంటలకు స్కైలాబ్ పడిపోయిందని అందరినీ బయటకు పిలిచి చెప్పాడు. కానీ, కరోనా ఎలా వస్తుందో తెలియదు. రోజూ చస్తూ బ్రతకాల్సిన పరిస్థితే ఇప్పుడు తయారైంది’ అని సిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందిన సాగర్ల దేవయ్య అంటున్నాడు.

దావత్ చేసుకున్నాం…

స్కెలాబ్ పడుతుందని చెప్పిన రోజు మాత్రమే ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు మాత్రం నెల రోజులు అయినా బయటకు వెళ్లలేని పరిస్థితి తయారైంది. బతికితే బతుకుతాం చస్తే చస్తాం అనుకుని నేను మా దోస్తులు కలిసి రోజు సరదాగా గడిపాం. స్కైలాబ్ పడ్డప్పుడు కోళ్లు, మేకలు కోసుకుని రోజూ దావత్ లు చేసుకునేటోళ్లు. స్కైలాబ్ సముద్రంలో పడ్డదని తెలిసిన తరువాత మేం మళ్లీ రోజువారి పనులు చేసుకోవడంలో మునిగిపోయాం’ అని భూపాలపల్లి జిల్లా బోర్లగూడెంకు చెందిన కేశవరెడ్డి చెప్పాడు.

tags: Karimnagar, Skylab, Corona, Radio

Next Story