చిన్న వయస్సులోనే అంతా గొప్ప పనిచేసిన 12 ఏళ్ల బాలిక..

by  |
shareef
X

దిశ, ఫీచర్స్ : దేశంలో ఎంతోమంది రైతులు పేదరికంలో మగ్గిపోతున్న విషయం తెలిసిందే. వారి ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు అవలంబించాల్సిన విధానాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే అన్నదాతల అవస్థలు చూసి చలించిపోయిన షాజానా షరీఫ్ అనే సామాజిక కార్యకర్త.. రైతులకు అన్ని విధాలా సాయపడేందుకు ‘సేవ్ ది ఫార్మర్’ మిషన్‌ను ప్రారంభించింది. కొత్త వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు ఉత్పాదకత పెంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వాడుకోవాలో వివరిస్తోంది.

బాల్యంలో ఓసారి పొలాన్ని సందర్శించిన షాజానా.. పంటలు పండించేందుకు రైతులుపడే కష్టాన్ని కళ్లారా చూసింది. ఆ రోజు నుంచి రైతులపై ఎనలేని అభిమానాన్ని పెంచుకుంది. కానీ దశాబ్దాలుగా రైతుల తలరాత మారడం లేదనే విషయం ఆమెకు బోధపడింది. వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయం రంగం ఇప్పటికీ నష్టాలు ఎదుర్కొంటోందని, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు ఆత్మహత్యలతో జీవితాన్ని ముగిస్తున్నారనే విషయాలు ఆమెను ఆశ్చర్యానికి గురిచేశాయి. దీంతో రైతుల కష్టాల్ని స్వయంగా తెలుసుకునేందుకు గ్రామాల్లో పర్యటిస్తూ ఓ గ్రామంలోని మహిళా రైతును కలిసింది. భర్త మరణించడంతో ముగ్గురు పిల్లల్ని పోషిస్తూ, తనకున్న ఎకరం పొలంలో రాత్రింబవళ్లు కష్టపడుతున్న విషయం తెలుసుకుని షాజానా ఆ మహిళా రైతును దత్తత తీసుకుంది. ఈ క్రమంలోనే మరో ఇద్దరు రైతుల్ని కూడా దత్తత తీసుకుంది.

‘రైతులు నిరక్షరాస్యత, అవగాహన లేమి కారణంగా నష్టపోతారు. సాధారణంగా వాళ్లు పాత వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తారు. దీని వల్ల పంట సమస్యలను ఎదుర్కొంటారు. వాతావరణ మార్పుల వల్ల కూడా పంట నష్టపోతున్నారు. వారికి టెక్నాలజీ ఉపయోగాన్ని వివరిస్తున్నాను. ప్రభుత్వాలు అందించే పథకాలపై అవగాహన కల్పిస్తున్నాను. ఇప్పటికే రైతుల కోసం పనిచేస్తున్న వారితో కలిసి కొన్ని పనులు చేస్తున్నాను. కొత్త వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు వారి చట్టపరమైన పత్రాలను తయారు చేయడంలోనూ చొరవ చూపించాను. మన్ముందు అన్ని విషయాల్లోనూ రైతులకు సాయం చేస్తూ వారిని స్వయం సమృద్ధిగా చేస్తాను.’
– షాజానా షరీఫ్


Next Story