వారికి ఇవే చివరి ఒలంపిక్స్..

by  |
వారికి ఇవే చివరి ఒలంపిక్స్..
X

దిశ, స్పోర్ట్స్ : ప్రపంచ క్రీడా పండుగ ఒలంపిక్స్‌లో పతకం గెలుచుకోవాలని ఏ క్రీడాకారుడు లేదా క్రీడాకారిణికైనా ఉంటుంది. తమ కెరీర్‌లో ఎన్నో కప్పులు, మెడల్స్ గెలుచుకున్నా.. ఒలంపిక్ పతకం లేని లోటు మాత్రం వారిని జీవితాంతం వెంటాడుతుంది. కరోనా కారణంగా గత ఏడాది జరగాల్సిన ఒలంపిక్స్ 2021 జులై 23 నుంచి ప్రారంభం కానున్నాయి. తమ కెరీర్ చివరి దశకు చేరుకున్న ముగ్గురు దిగ్గజ క్రీడాకారిణులు ఎలాగైనా ఈ ఒలంపిక్స్‌లో పతకం గెలుచుకోవాలని అనుకుంటున్నారు. మరోసారి ఒలంపిక్స్ ఆడే అవకాశం వస్తుందో రాదో అనే సందిగ్దంలో ఉన్న వీరు ముగ్గురు ప్రస్తుతం ఒలంపిక్ పోడియమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వారే టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బాక్సింగ్ చాంపియన్ మేరీ కోమ్, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్.

సానియా కల అదే..

ఆరుసార్లు గ్రాండ్ స్లామ్ టెన్నిస్ డబుల్స్ విజేత అయిన సానియా మీర్జా ఖాతాలో ఒక్క ఒలంపిక్ మెడల్ కూడా లేదు. దేశంలో ఎంతో మంది టెన్నిన్ ఆడటానికి స్పూర్తిగా నిలిచిన ఈ స్టార్‌కు ఒలంపిక్ మెడల్ అందని ద్రాక్షగా మిగిలింది. 2016 రియో ఒలంపిక్స్‌లో తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నది. ఆ తర్వాత ఆటకు వీడ్కోలు కూడా పలికింది. 2018లో ఒక బిడ్డకు తల్లైన తర్వాత సానియా మీర్జా మనసు మార్చుకుంది. తిరిగి రాకెట్ చేత పట్టి సాధన మొదలు పెట్టింది. కరోనా కారణంగా గత ఏడాదంతా టెన్నిస్ కోర్టుకు దూరంగా ఉన్న సానియా.. ఒలంపిక్ బెర్త్ కోసం తీవ్రంగా కష్టపడుతున్నది. ప్రస్తుతం ఖతర్‌ ఓపెన్‌ ఆడుతున్న సానియా మీర్జా.. ఒలంపిక్ మెడల్ తన కల అని.. దాని కోసం ఏమైనా చేస్తానని చెబుతున్నది. ఇక నా టెన్నిస్ కెరీర్ దాదాపు ముగిసిపోయింది. కానీ చివరిగా ఒలంపిక్ పోడియం ఎక్కి పతకాన్ని అందుకోవాలన్నదే నా కోరిక అని సానియా అంటున్నది.

మేరీ కోమ్‌కు స్వర్ణం కావాలి..

భారత స్టార్ బాక్సర్ మేరీ కోసం 2012 లండన్ ఒలంపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్నది. అప్పటికే ఆమె ఐదు సార్లు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌గా సుపరిచితం. ఆ ఒలంపిక్స్ అనంతరం 2013లో మూడో కొడుకు జన్మించిన తర్వాత బాక్సింగ్‌ రింగ్‌కు దూరమయ్యింది. అయితే 2018 వరల్డ్ చాంపియన్‌షిప్ ఢిల్లీలో నిర్వహించినప్పుడు తిరిగి రింగ్‌లోకి అడుగుపెట్టింది. ఆ టోర్నీలో అద్భుత ప్రతిభ కనబరిచిన మేరీ కోమ్ 6వ సారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. ప్రస్తుతం టోక్యో ఒలంపిక్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న మేరీకోమ్ ఎలాగైనా స్వర్ణపతకం సాధించాలని కలలు కంటున్నది. వరల్డ్ చాంపియన్‌గా ఉన్న తాను ఒలంపిక్ గోల్ మెడలిస్ట్‌గా కూడా గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నది. ఈ ఒలంపిక్స్ తనకు చివరివి కావడంతో పతకం కోసం తీవ్రంగా కష్టపడుతున్నది. ప్రస్తుతం బాక్సమ్ ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్‌లో సెమీస్‌కు చేరుకున్నది.

సైనాకు కష్టకాలం..

భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పేలవ ఫామ్‌తో ఉన్నది. లండన్ ఒలంపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన సైనా.. రియోలో మాత్రం పతకం సాధించలేక పోయింది. మూడు సార్లు కామన్వెల్త్ గోల్డ్ గెలిచిన సైనా.. ఒలంపిక్స్‌లో కూడా గోల్డ్ సాధించాలని కష్టపడుతున్నది. ప్రస్తుతం 30 ఏళ్లున్న సైనా.. వచ్చే ఒలంపిక్స్ వరకు కెరీర్ కొనసాగిస్తుందో లేదో అనే అనుమానాలు ఉన్నాయి. ఈ మధ్య గాయాల కారణంగా పలు టోర్నీలు ఆడలేదు. అంతే కాకుండా ఈ ఏడాది వరుసగా ఓటములు చవిచూస్తోంది. ఇంకా ఒలంపిక్ బెర్త్ కూడా కన్ఫార్మ్ కాని సైనా ముందు దానిపై దృష్టిపెట్టాల్సి ఉంది. జూన్ ఆఖరు నాటికి సైనా మెరుగైన ర్యాంకు సాధిస్తే బెర్త్ దక్కే అవకాశం ఉన్నది. అప్పుడు తన ఒలంపిక్ స్వర్ణంపై పూర్తిగా దృష్టిపెట్టవచ్చు.

Next Story

Most Viewed