దళితబంధు మార్గదర్శకాలు ఇవే..

by  |
Dalitbandhu
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎట్టకేలకు రెండున్నర నెలల తర్వాత దళితబంధు పథకానికి ప్రభుత్వం మార్గదర్శకాలను మెమో రూపంలో శనివారం విడుదల చేసింది. యాదాద్రి, వరంగల్, కరీంనగర్ జిల్లాల కలెక్టర్లకు అందజేసింది. ఈ పథకం లబ్ధిదారులను ఐదు గ్రూపులుగా విభజించింది. లబ్ధిదారులకు మండలాలవారీగా వేర్వరు బ్యాంకుల్లో ప్రత్యేక ఖాతాలను తెరిపించడానికి కలెక్టర్లు చొరవ తీసుకోవాలని ఆదేశించింది. ఈ పథకం కింద ప్రభుత్వం నుంచి అందే రూ. 10 లక్షల్లో రూ. 10 వేలను రక్షణ నిధికి మినహాయించుకుని మిగిలిన రూ. 9.90 లక్షలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నది. లబ్ధిదారులు ఎంచుకునే వ్యాపారాలను మొత్తం ఐదు గ్రూపులుగా విభజించింది. కలెక్టర్ ఆదేశాల తర్వాతమే లబ్ధిదారుల ఖాతా నుంచి యూనిట్లను సరఫరా చేసే దుకాణం లేదా సంస్థకు ఎలక్ట్రానిక్ పద్ధతిలో డబ్బులు విడుదలవుతాయి.

ఇప్పటికే దళితబంధు పథకం అమలుకు సంబంధించి ప్రాథమిక మార్గదర్శకాలను ప్రభుత్వం ఆగస్టు చివరివారంలో విడుదల చేసింది. ప్రస్తుతం హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో మళ్ళీ మెమో రూపంలో జారీ చేసింది. జీవో రూపంలో జారీ కావాల్సిన మార్గదర్శకాలు మెమో రూపంలో విడుదల కావడం పలు అనుమానాలకు తావిచ్చినట్లయింది. తాజా మార్గదర్శకాల్లో మొత్తం 33 అంశాలను రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి కార్పొరేషన్ కార్యదర్శి రాహుల్ బొజ్జా ప్రస్తావించారు. లబ్ధిదారులు ఎంచుకున్న రంగానికి సంబంధించి జిల్లా స్థాయిలో సంబంధిత శాఖ అధికారి నేతృత్వంలో ప్రత్యేక సెక్టార్ బృందం అవగాహన కల్పించి తగిన శిక్షణ ఇప్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

గ్రామాలవారీగా లబ్ధిదారుల జాబితాను రూపొందించడంతో పాటు వారు ఎంచుకునే వ్యాపారాన్ని బట్టి గ్రూపులుగా విభజించాల్సి ఉంటుంది. వ్యవసాయం, పాలడైరీ తదితరాలన్నీ ఒక గ్రూపుగా ఉంటాయి. క్యాబ్ సర్వీసు, రవాణా మరో గ్రూపుగా ఉంటాయి. ఉత్పత్తి రంగం, పారిశ్రామిక యూనిట్లు మూడవ గ్రూపు. చిల్లర దుకాణాలు, ఇతర వ్యాపారాలు మరొక గ్రూపు. ఇక టెంట్ హౌజ్, సర్వీసుల లాంటివి చివరి గ్రూపుగా ఉండనున్నాయి. ఈ వరుస క్రమంలోనే లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆయా గ్రూపులకు తగినట్లుగా ఆ రంగాలకు చెందిన అధికారులు, అవసరాన్ని బట్టి ఎన్జీవో సంస్థల ద్వారా లబ్ధిదారులకు శిక్షణ ఇప్పించడంపై కలెక్టర్ దృష్టి పెట్టాలని సూచించారు.

లబ్ధిదారులకు అవగాహన కల్గించడం, శిక్షణ పూర్తి చేయడం, ఇక వ్యాపారం ప్రారంభించడమే తరువాయి అని కలెక్టరు సంతృప్తి చెందిన తర్వాతనే లబ్ధిదారుల ఖాతా నుంచి యంత్రాలను, ఉపకరణాలను, సామాన్లను సరఫరా చేసిన దుకాణాలకు, కంపెనీలకు డబ్బులు విడుదల చేయాలని సూచించారు. కలెక్టర్ ఆదేశం ఉంటే తప్ప బ్యాంకులు డబ్బను బదిలీ చేయరాదని నొక్కిచెప్పారు. ప్రతీ గ్రూపుకు రిసోర్స్ పర్సన్లను కూడా నియమించాలని, గరిష్ఠంగా ఆరు వారాల్లో శిక్షణ పూర్తిచేసేలా చూడాలని పేర్కొన్నారు. గ్రామాల వారీగా లబ్ధిదారులకు అవగాహనా కార్యక్రమాలు, శిక్షణ, వ్యాపారం ప్రారంభించడానికి నిర్దిష్టమైన షెడ్యూలును, గ్రూపులవారీగా లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని పేర్కొన్నారు. దానికి అనుగుణంగానే లబ్ధిదారుల ఖాతా నుంచి డబ్బులు విడుదల చేయడంపై ఆయా బ్యాంకులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.

కొన్ని సందర్భాల్లో లబ్ధిదారులు ఒకటి కంటే ఎక్కువ విభాగాలతో ముడిపడిన వ్యాపారాన్ని ఎంచుకుంటారని, అలాంటి సమయాల్లో కలెక్టరు పటిష్ట సమన్వయాన్ని రూపొందించాలని పేర్కొన్నారు. పాల డైరీ వ్యాపారం ఎంచుకున్నప్పుడు పాడి పశువులు ఒక శాఖకు, వాటిని రవాణా చేయడానికి కొనుగోలు చేసే వాహనం మరో శాఖకు సంబంధించినవిగా ఉంటాయని, వీటికి తగినట్లుగానే వేర్వేరు గ్రూపుల రిసోర్సు పర్సన్లు, సెక్టార్ టీమ్‌లు అవగాహన, ట్రెయినింగ్ షెడ్యూలు అమలుపై సమన్వయించుకోవాలని పేర్కొన్నారు. ఒక్కోసారి ఒకరికంటే ఎక్కువ మంది లబ్ధిదారులు కలిసి ఒకే యూనిట్‌గా వ్యాపారాన్ని పెట్టే అవకాశం ఉంటుందని, దీని విషయంలో కూడా అధికారులు తగిన సహకారం ఇవ్వాలని సూచించారు.

Next Story

Most Viewed