ప్రత్యామ్నాయ పంటలతో లాభాలు గడిస్తున్న ‘సంగారెడ్డి’ రైతులు

by  |
Basmati paddy
X

దిశ, ఫీచర్స్ : ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు పడుతున్న అవస్థల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కల్లాల్లో ఆరబోసిన ధాన్యానికి కటిక చలిలో కాపలా కాస్తూ ప్రభుత్వ దయ కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలొచ్చినా ప్రపంచానికే అన్నం పెడుతున్న అన్నదాతల రాత మాత్రం మారడం లేదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ.. ఇద్దరు తెలంగాణ రైతులు ప్రత్నామ్నాయ పంటలతో నేలతల్లి కడుపున సిరులు పండిస్తూ వహ్వా అనిపించుకుంటున్నారు. దినసరి ధాన్యం కోసం కష్టపడుతున్న అమాయక రైతుల పక్కనే.. సంగారెడ్డి జిల్లాలోని తడ్కల్ క్లస్టర్‌కు చెందిన వీరిద్దరూ అద్భుతాలు సృష్టిస్తూ పంట మార్పుల అవసరాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నారు.

కంగ్టి మండలానికి చెందిన రైతులు ప్రతీ సీజన్‌లో వరి పంట వైపై మొగ్గుచూపేవారు. కానీ చివరకు నష్టాలే పలకరిస్తుండటంతో అయోమయానికి గురయ్యేవారు. ఈ క్రమంలో లాభాలు స్థిరంగా రావాలంటే ప్రత్యామ్నాయ పంటలు మేలని తడ్కల్ గ్రామస్తుడు మోచి పండరి, చాప్టా(బి) నివాసి హవప్ప గ్రహించారు. అలా వ్యవసాయ అధికారుల సలహాలతో బాస్మతి వరి సాగు చేపట్టారు. ప్రస్తుతం తన అర ఎకరం పొలంలో బాస్మతి వరి పండిస్తున్న పండరి, ఆ ప్లాటు నుంచి ప్రతి సీజన్‌లో నాలుగు బస్తాల ధాన్యాన్ని పొందుతున్నాడు. లాభాలు గడించడంతో తను పండించిన బాస్మతి రకం విత్తనాలను తోటి రైతులకు అందిస్తూ వారు కూడా సాగు చేసేందుకు సాయపడుతున్నాడు. కాగా వర్షకాలంలో మాత్రమే వరి పండించే పండరి.. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేస్తానని పేర్కొన్నాడు.

నువ్వులతో నవ్వులు..

స్థానిక మార్కెట్‌లో నువ్వులకు అధిక డిమాండ్‌ ఉండగా.. ఈ సాగుకు పెద్దగా శ్రమపడాల్సిన అవసరం కూడా లేదు. దీంతో రెండేళ్ల క్రితం కేవలం 10 గుంటల్లో నువ్వుల పంట వేసిన హవప్ప.. ఆశించిన లాభాలు రావడంతో ఇప్పుడు మరో 10 గుంటల్లో సాగు వేస్తున్నాడు. ఇలా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం ద్వారా ఏడాదికి రూ. 4 లక్షలు ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇదే క్రమంలో మిగిలిన ఐదున్నర ఎకరాల్లో నువ్వులతో పాటు జొన్న, పత్తి, కందులు, సన్‌ఫ్లవర్ పండిస్తున్నాడు.

గత వానకాలంలో రెండున్నర ఎకరాల్లో సాగుచేసిన పత్తి పంటకు 25 క్వింటాళ్ల దిగుబడిని పొందగా.. రూ. 1.7 లక్షల ఆదాయం వచ్చింది. కాగా గతేడాది క్వింటాల్‌ పత్తికి రూ.7,400 ధర పలకగా.. ప్రస్తుతం రూ.8,900కి పెరిగింది. రైతులు మార్కెట్ రేట్లు, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకోవాలి. వరి వేస్తే నిత్యం కష్టపడాల్సిందే. వానొచ్చినా, రాకపోయినా.. మద్ధతు ధర లభించకపోయినా, ప్రభుత్వం కొనకపోయినా ఎన్నో కష్టాలు పడాలి. కానీ ప్రత్యామ్నాయ పంటలను పండించడం చాలా సులభం. ఎలాంటి అవాంతరాలు ఉండవు.
– హవప్ప, రైతు


Next Story

Most Viewed