గ్రాడ్యుయేట్ ‘దొంగలు’.. Youtubeలో వీడియోలు చూసి..

by  |
గ్రాడ్యుయేట్ ‘దొంగలు’.. Youtubeలో వీడియోలు చూసి..
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడి అప్పులపాలై, వ్యస‌నాలకు బానిసైన యువ‌కులు చోరీలకు పాల్పడుతూ వ‌రంగ‌ల్‌ పోలీసుల‌కు చిక్కారు. ఇద్దరు దొంగలను సీసీఎస్, సుబేదారి పోలీసులు సంయుక్తంగా గురువారం అరెస్టు చేశారు. నిందితుల వ‌ద్ద నుంచి సుమారు రూ.42 లక్షల విలువైన 825 గ్రాముల బంగారు ఆభరణాలు, 846 గ్రాముల వెండి వస్తువుల‌ను, ద్విచక్రవాహనంతో పాటు ల్యాప్ టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీపీ తరుణ్ జోషి వెల్లడించిన వివ‌రాల ప్రకారం.. మ‌హ‌బూబాబాద్ జిల్లా కొత్తగూడ మండ‌లం ఎల్లామార్ గ్రామానికి చెందిన ఏనబోతుల సునీల్, కుర‌వి మండ‌లం త‌ట్టుప‌ల్లి గ్రామానికి చెందిన లావుడ్య సాగ‌ర్‌(19)లు కొంత‌కాలంగా వ‌రంగ‌ల్‌, హ‌న్మకొండ ప‌ట్టణాల‌తో పాటు ప‌రిస‌ర గ్రామాల్లో ఇళ్లల్లో తాళాలు ప‌గుల‌గొట్టి దొంగ‌త‌నాల‌కు పాల్పడుతున్నారు.

ఇలా దాదాపు సునీల్ 15 దొంగ‌త‌నాలు చేసిన‌ట్లుగా తెలిపారు. చివ‌రి రెండు దొంగ‌త‌నాల్లో స‌మీప బంధువైన సాగ‌ర్ కూడా పాలుపంచుకున్నాడ‌ని తెలిపారు. ఇద్దరు విద్యావంతులేన‌ని, సునీల్ ఎంఎస్సీ కంప్యూట‌ర్ సైన్స్ పూర్తి చేసిన‌ట్లు విచార‌ణ‌లో వెల్లడించాడ‌ని తెలిపారు. సాగ‌ర్ కూడా బీకాం పూర్తి చేశాడ‌ని, ఇద్దరు క్రికెట్ బెట్టింగ్‌లో డ‌బ్బులు పెడుతూ అప్పుల పాల‌య్యార‌ని, ఇందుకోసం తెలిసిన వారి పేర్ల మీద లోన్లు కూడా పొందార‌ని అన్నారు. చేసిన అప్పులను తీర్చేందుకు సునీల్ దొంగ‌త‌నాల‌కు పాల్పడాల‌ని నిర్ణయించుకుని యూట్యూబ్‌లో రాబ‌రీల‌కు సంబంధించిన వీడియోల‌ను, క్రైం సీరియ‌ల్స్‌ను చూసిన‌ట్లు విచార‌ణ‌లో ఒప్పుకున్నాడ‌ని వెల్లడించారు.

ఉద‌యం వేళ‌ల్లో తాళం వేసిన ఇళ్లను రెండు మూడు రోజులు గ‌మ‌నించి ఎవ‌రూ లేర‌ని నిర్ధారించుకున్నాకే అర్ధరాత్రి స‌మ‌యం దాటిన త‌ర్వాత దొంగ‌త‌నాల‌కు పాల్పడేవార‌ని చెప్పారు. సుబేదారిలో జ‌రిగిన ఓ దొంగ‌త‌నం కేసులో వీరిపై నిఘా ఉంచి అధునాత‌న టెక్నాల‌జీ ఆధారంగా నిందితుల‌ను ప‌ట్టుకున్నట్లు సీపీ తెలిపారు. నిందితులిద్దరిని రిమాండ్‌కు త‌ర‌లిస్తున్నట్లు చెప్పారు.


Next Story

Most Viewed