మత్తెక్కించి, మైమరిపించి.. యువకుడిని మోసం చేసిన యువతి

by  |
Matrimony cheating
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల పెళ్లి పేరుతో చేసే మోసాలు పెరిగిపోతున్నాయి. వధూవరుల కోసం మ్యాట్రిమోనిలను ఆశ్రయిస్తున్న యువత.. నకిలీల ఉచ్చులో చిక్కుతూ తీవ్రంగా నష్టపోతున్నారు. విదేశాల్లో ఉంటున్న.. పెళ్లి చేసుకుంటా అని గిఫ్ట్‌ల పేరిట లూటీ చేస్తున్నారు. అందినకాడికి దండుకుని ముఖం చాటేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన యువకుడిని ఓ యువతి ఇలాగే చీటింగ్ చేసింది.

హైదరాబాద్‌లోని మెట్టుకుగూడకు చెందిన విక్రమ్ వధువు కోసం ఓ మ్యాట్రిమోనిలో తన ప్రొఫైల్‌ను పెట్టాడు. ఆ వివరాలతో ఇటీవల విదేశీ ఫోన్ నంబర్ తో ఓ యువతి విక్రమ్ కు కాల్ చేసింది. తన పేరు పమేలా బిందే అని, యూకేలో స్థిరపడిన ఎన్నారై కుటుంబం అని వివరించింది. నీ ప్రోఫైల్ చూశానని, నీతో పెళ్లికి నేను ఓకే అని చెప్పింది. మీరు అంగీకారం తెలిపితే ఇండియా వచ్చి అక్కడే పెళ్లి చేసుకుంటానని వలపుల వల విసిరింది.

విక్రమ్ ఆ యువతి ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. విదేశీ అమ్మాయిని వివాహం ఆడుతున్నట్లు ఊహల్లో విహరించాడు. ఈలోగా ఆ యువతి విక్రమ్‌కు కాల్ చేసింది. మత్తైన మాటలతో మాయ చేసింది. మన వివాహానికి రూ.కోట్లలో ఖర్చు అవుతుందని, ఆ డబ్బులను కూడా నేను పంపిస్తానని చెప్పింది. చెక్కు పంపిస్తున్నానని, దానిని తీసుకోవాలని కోరింది.

ఆమె చెప్పినట్టే.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారిని అంటూ విక్రమ్ కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. విక్రమ్ పేరుతో యూకే నుంచి చెక్ వచ్చిందని, దానిని తీసుకుని వెళ్లాలని దాని సారాంశం. అయితే ఆ చెక్‌ను తీసుకోవడానికి వివిధ ట్యాక్సీల పేరిట దుండగులు రూ.2 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత ఆ యువతి ఫోన్, దుండగుల సెల్ పని చేయకపోవడంతో తాను మోసపోయానని గ్రహించాడు. వెంటనే సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించినట్లు సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు. ఇలాంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

Next Story

Most Viewed