రెవెన్యూ ఆఫీసులో ‘రేటు’ ఫిక్స్.. లంచం ఇస్తేనే..

by  |
Chityala-Revenue-Office
X

దిశ, చిట్యాల : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల తహసీల్దార్ కార్యాల‌యంలో లంచావ‌తారులు పెరిగిపోతున్నారు. ప‌నికో రేటును ఫిక్స్ చేసి అధికారికంగా దండుకుంటున్నారు. వ్యవసాయ భూములు, క్వారీ ఏర్పాటు, రేషన్ డీలర్స్.. పేర్ల మార్పిడి విషయంలో బాధితుల నుంచి లంచాలు డిమాండ్ చేస్తూ వరుసగా ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు. గతంలో చిట్యాల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన తహసీల్దార్ సూరిబాబు క్వారీ ఏర్పాటు కోసం రూ.40 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.

పట్టాదారు పాసు పుస్తకం కోసం డబ్బులు డిమాండ్ చేసి.. మరో తహసీల్దార్ పాల్ సింగ్, వీఆర్వో రవీందర్లు ఏసీబీ అధికారులకు చిక్కారు. డీలర్లకు ఇచ్చే కమీషన్ విషయంలో చెక్కు జారీ చేయడానికి రూ. 40 వేలు డిమాండ్ చేసి డిప్యూటీ తహసీల్దార్ కిరణ్ కుమార్ ఏసీబీ వలకు చిక్కారు. తాజాగా సర్వేయర్ పావని కూడా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు. జూకల్ గ్రామానికి చెందిన శ్రవణ్ కుమార్ నుంచి గూగుల్ పే ద్వారా 10వేలు లంచం తీసుకొని ఏ-2 నిందితురాలిగా పట్టుబడ్డారు. చిట్యాల రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి సర్వేయర్ పావనితో కలిసి భారీగానే డబ్బులు దండుకున్నాడనే చర్చ కొనసాగుతోంది. ఒక్క పావని మాత్రమే కాదని.. సదరు అధికారి పట్టుబడితే మండలానికి పట్టిన పీడ వదులుతుంద‌ని రైతులు చర్చించుకుంటున్నారు.

ప‌నికో రేటు ఫిక్స్‌..

కార్యాలయంలో చేసే ప్రతీ పనికి ఓ రేట్ ఫిక్స్ చేసి మరీ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాములుగా ఇచ్చే ధ్రువీకరణ పత్రాలకు కూడా లంచాలు లేనిదే జారీ చేసే పరిస్థితులు కనిపించడంలేదనే విమర్శలు ఉన్నాయి. ధరణి రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే భూ యజమానులు, కొనుగోలుదారుల నుంచి కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Next Story