వ్యవసాయాధికారులు మొద్దు నిద్ర వీడాలి

by  |
వ్యవసాయాధికారులు మొద్దు నిద్ర వీడాలి
X

దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు వరంగల్ జిల్లా మున్సిపల్ పరిధిలోని రంగశాయిపేట గ్రామ శివారులోని బెస్తం చెరువుకు గండిపడి ఆయకట్టు రైతులు భారీగా పంటనష్టపోయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం వరంగల్ పౌర స్పందన వేదిక క్షేత్రస్థాయి పర్యటన చేసింది. సమాచారం అందుకున్న బాధిత రైతులు వారితో పంటనష్టం వివరాలు తెలియజేశారు. పంట పొలాల్లో నిండిన ఇసుకను చూపి, కన్నీరుమున్నీరుగా విలపించారు. అంతేగాకుండా పలుమార్లు అధికారులకు, కలెక్టర్‌కు విషయం తెలిపినా, పట్టించుకోవడం లేదని వాపోయారు.

అంతేగాకుండా ఇరిగేషన్ అధికారులు చెరువుకట్టకు పడిన గండిని పరిశీలించి సమగ్ర నివేదిక స్థానిక తహసీల్దార్‌కు అందించి నెలలు గడుస్తున్నా… ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. అనంతరం ఈ సందర్భంగా వేదిక సమన్వయ కర్త నల్లెల్ల రాజయ్య మాట్లాడుతూ… చెరువు కట్టకు గండి పడి, వరిపంటలు నేలకొరిగి రైతులకు తీవ్రనష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు. చెరువు కట్ట గండి పడి మూడు నెలలు గడిచిపోయినా వ్యవసాయాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి కైనా వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి బాధిత రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

Next Story