ప్రభుత్వం వద్దన్నా వరి సాగుకే రైతుల మొగ్గు.. రికార్డు స్థాయిలో నాట్లు!

by Anukaran |   ( Updated:2021-12-09 11:32:05.0  )
Vari sagu
X

దిశ, తెలంగాణ బ్యూరో : యాసంగి వరి సాగు మొదలైంది. ఈ సీజన్‌లో వరి సాగు వేయవద్దంటూ ప్రభుత్వం చెప్పుతున్నా రైతులు నాట్లు మొదలుపెట్టారు. డిసెంబర్​8 నాటికి ఏడు వేల ఎకరాల్లో వరినాట్లు వేశారు. గత ఏడాది ఇదే సమయానికి చేసిన సాగుకంటే ఇది రెట్టింపుగా ఉంది. ఇక గతంలో ముందుగా కామారెడ్డి, కరీంనగర్​వంటి జిల్లాల్లో ముందస్తు సాగు చేస్తే.. ఈసారి మాత్రం నల్గొండలో రైతులు ముందున్నారు. సాగర్‌తో పాటుగా ఆయా ప్రాంతాల్లో వరిసాగు ముమ్మరం చేశారు. మరోవైపు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇంకా ధాన్యం కళ్లాల్లోనే ఉంది. ఇంకా 60 శాతం ధాన్యం రోడ్లపైనే వేసుకుని కొనుగోళ్ల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.

7012 ఎకరాల్లో వరి సాగు

రాష్ట్ర వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం బుధవారం నాటికి 7012 ఎకరాల్లో వరినాట్లు వేసినట్లు వెల్లడించారు. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం గత ఏడాది డిసెంబర్​నాటికి 4,625 ఎకరాల్లో సాగు కాగా.. ఈ ఏడాది మాత్రం అది 7 వేల ఎకరాలు దాటింది. ప్రస్తుత పరిస్థితుల్లో వరి సాగు వద్దంటూ అటు ప్రభుత్వం తేల్చి చెప్పింది. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయమంటూ సీఎం కేసీఆర్​ ప్రకటించారు. కానీ రైతులు మాత్రం సీజన్​ ముందు నుంచే వరిసాగు పనులు ముమ్మరం చేస్తున్నారు. ఇక నుంచి వరి సాగు గణనీయంగా పెరుగుతుందని రైతులు చెప్పుతున్నారు.

జిల్లాల వారిగా చూస్తే.. నల్గొండ జిల్లాలో 4,620 ఎకరాలు, నిజామాబాద్​ జిల్లాలో 987, సంగారెడ్డిలో 621, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో 262, జోగుళాంబ గద్వాల జిల్లాలో 253, రంగారెడ్డి జిల్లాలో 200 ఎకరాల్లో వరిసాగు చేశారు. ఈ నెలాఖరులోగా కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మెదక్ ప్రాంతాల్లో వరినాట్లు భారీగా పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ భావిస్తోంది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం వరి సాధారణ సాగు 31.01 లక్షల ఎకరాలుగా అంచనా వేశారు. గత ఏడాది యాసంగిలో కూడా 39.31 లక్షల ఎకరాల్లో సాగు అంచనా వేస్తే.. ఏకంగా 52.80 లక్షల ఎకరాల్లో వరి సాగైంది.

మొక్కజొన్నపై ఆశ

మరికొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్న సాగుపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. గతంలో నియంత్రిత సాగును ప్రకటించిన ప్రభుత్వం మొక్కజొన్న వద్దంటూ సూచించింది. అయినా రైతులు సాగు చేశారు. ఈసారి వరి సాగు వద్దంటున్నారు. ఇదే సమయంలో మొక్కజొన్నను కొన్నిచోట్ల ప్రత్యామ్నాయంగా వేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 12 వేల ఎకరాలు, నిర్మల్​లో 17 వేల ఎకరాలు, కామారెడ్డిలో 9 వేల ఎకరాలు, నిజామాబాద్​లో 8,766 ఎకరాలు, సిద్దిపేటలో 8 వేల ఎకరాలు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నాటికి 94,080 ఎకరాల్లో మొక్కజొన్న వేశారు.

రాష్ట్రంలో వివిధ పంటల సాగు ఇలా..

పంట విస్తీర్ణం
వరి 7012
మొక్కజొన్న 94,080
వేరుశనగ 2,87,233
శనగ 2,70,482
జొన్న 25479
పొద్దుతిరుగుడు 16280
పెసర 8,026
ఫుడ్​ క్రాప్స్​ 42964
పలు రకాల మొత్తం పంటలు
8,34,164

Next Story

Most Viewed