కొవిడ్ బాధితుల కన్నీటి ధార.. ఇంటికి రానీయమని బంధువులు

by  |
కొవిడ్ బాధితుల కన్నీటి ధార.. ఇంటికి రానీయమని బంధువులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : “కాలం కాటేసింది.. కరోనా మాటేసింది. వైరస్ సోకి దవాఖానల మంచం మీద పడుకున్న వాళ్లు కొందరు.. బయట వాళ్ల కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్న వాళ్లు మరికొందరు.. వారు బయటికి రాలేరు.. వీరు లోపలకు పోలేరు. కడుపులో పేగులు మెలిపెడుతున్న బాధ. ఏడ్చి ఏడ్చి కన్నులు ఎండిపోయినయి.. అక్కడ వాళ్లు మరణయాతన అనుభవిస్తుంటే.. ఇక్కడ వీళ్లు నరకయాతన పడుతున్నారు. లోపల ఉన్నవారు ఉన్నరా? పోయారా? తెలియదు. సిబ్బంది మాత్రం వేల రూపాయలు కట్టమంటున్నరు. ఎక్కడి నుంచి తెచ్చి కట్టేది? సొమ్ములమ్మి, భూములమ్మి, ఇండ్లు తాకట్టు పెట్టి తెచ్చిన సొమ్మలు కరిగిపోతున్నయి. మంచం మీద ఉన్నోళ్ల ప్రాణాలకూ గ్యారంటీ లేదు. తినాలన్నా తిప్పలే. ఐదు రూపాయల అన్నం ఒక్కరు తెచ్చుకుని ఇద్దరు పంచుకుని తింటున్నరు. రాత్రిపూట ఏదో షెల్టర్లో పదో, పరకో ఇచ్చి పడుకోవడం.. తెల్లారి లేస్తే షరా మామూలే. సుట్టాలు, దోస్తులు ఎవ్వరూ ఇండ్లళ్లకు రానియ్యడం లేదు. కరోనా పేషెంట్ల బంధువుల అరణ్య రోదన ఇది. సర్కారు మాత్రం చేతులెత్తేసి చోద్యం చూస్తున్నది.”

బయటే పడగాపులు..

కరోనా బతుకులను చిద్రం చేస్తోంది. ఒకరికి ఒకరు కాకుండా చేస్తోంది. కరోనా పాజిటివ్​ వచ్చిన వారు హోం ఐసోలేషన్‌లో ఉంటే ఒకింత ఫర్వాలేదు కానీ.. ఆస్పత్రులకు వెళ్తేనే భయపడాల్సి వస్తోంది. ఎందుకంటే కరోనా పేషెంట్ల వార్డుల్లోకే అనుమతి ఉండదు. లోపలకు వెళ్లిన వారు మళ్లీ వస్తారో… వాళ్ల పరిస్థితి ఎలా ఉందో కించిత్​ కూడా బయటకు తెల్వనీయడం లేదు. అసలే ప్రైవేట్.. కార్పొరేట్​ఆస్పత్రులు. ప్రస్తుతం కరోనా చికిత్సలు చేస్తున్నవన్నీ పెద్దాస్పత్రులే. చిన్న చిన్న రోగాలకే సవాలక్ష ఆంక్షలు. లోపలకు వెళ్లాంటేనే అదో పద్మవ్యూహంలా ఉంటోంది. కానీ అదే కోవిడ్​ సమయం… పేషెంట్ల దగ్గరకు వెళ్లడం కాదు.. అక్కడ ఎలా ఉన్నారో కూడా చెప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో లోపలున్న వారిని విడిచి ఉండలేక ఆస్పత్రుల ఎదుట పడిగాపులు ఉంటున్నారు. స్థానికంగా ఉండేవారు, ధనవంతులైతే ఒకింత ఇబ్బందులు ఉండటం లేదు కానీ… ఇతర ప్రాంతాల నుంచి, మధ్యతరగతి, పేద వర్గాల పరిస్థితి చాలా అధ్వాన్నంగా మారింది.

ఉండలేరు.. వెళ్లలేరు

“కరీంనగర్​ కార్ఖానాగడ్డకు చెందిన ఓ యువకునికి సరిగ్గా 24 రోజుల కిందట వివాహమైంది. వివాహ తంతు మొత్తం ముగిసిన పది రోజులకే తల్లి మృతి చెందింది. అదే బాధలో ఉన్న ఆ కుటుంబంలో కరోనా కల్లోలం సృష్టించింది. యువకునికి పాజిటివ్​ రావడంతో రెండు రోజులు ఇంటి దగ్గరే ఉన్నాడు. కానీ భయమో… ఆందోళనో తెల్వదు కానీ.. హైటెన్షన్​తో నగరంలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చేరాడు. పెళ్లై 20 రోజులు కూడా నిండని ఆ నవ వధువు.. తన భర్త కోసం రోజూ ఆస్పత్రి ఎదుటే ఉంటోంది. చికిత్స కోసం వారికి ఉన్న రెండు గదుల ఇంటిని కుదవపెట్టి రూ. 2.80 లక్షలు తీసుకువచ్చింది. ఇప్పటికే రూ. 2.30 లక్షలు ఖర్చు అయ్యాయి. చికిత్స చేస్తున్నాం.. డబ్బులు చెల్లించి బయటకు వెళ్లు.. ఆస్పత్రి వర్గాలు చెప్పుతున్న సమాధానం అంతే.

“రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన మరో వృద్ధురాలిది ఇదే పరిస్థితి. తన కొడుకుకు కరోనా సోకడంతో హైదరాబాద్​లోని ఓ కార్పొరేట్​ ఆస్పత్రిలో చేర్పించింది. వాస్తవానికి పేద కుటుంబమే అయినా.. పాణం మీదకు రావడంతో ఇంటిని, బంగారాన్ని తాకట్టు పెట్టి ఆస్పత్రిలో జాయిన్​ చేసింది. గురువారం నాటికి ఐదు రోజులు గడిచాయి. కానీ లోపల కొడుకు ఎలా ఉన్నాడో తెల్వదు. అడిగినా చెప్పరు. ధైర్యం చేసి పోదామంటే వెళ్లనీయరు. కానీ ఇప్పటికే రూ. 3.50 లక్షలు చెల్లించింది. ఇప్పుడు కొడుకు ఎలా వస్తాడో.. అనే ఆవేదనతో ఆస్పత్రి గేట్​ దగ్గరే వెంపర్లాడుతోంది.

ఒకే భోజనం.. పంచుకుని తిందాం..!

ఆస్పత్రి లోపల పేషెంట్ల పరిస్థితి బయటకు తెల్వదు కానీ.. బయట వారి కోసం ఉన్న వారు మాత్రం దుర్భరంగా రోజులు వెళ్లదీస్తున్నారు. లోపల ఉన్నవాళ్లు ప్రాణాలతో వస్తారా..శవమై వస్తారా అనేది ఎవరికీ తెల్వదు. ఒక్కొసారి శవాలు బయటకు వస్తుంటే అది ఎవరిదో అనే ఆందోళన. ఇక తెచ్చిన పైసలు ఫీజుల కోసం పూర్తి అవుతుంటే.. ఖర్చులకు వెనకాడాల్సిన పరిస్థితులున్నాయి. అందుకే ఉదయం ఖాళీ కడుపుతో ఉంటూ మధ్యాహ్నం 12 గంటల దాకా చూస్తూ రూ. 5 భోజనం తెరువగానే తింటున్నారు. రాత్రి సమయంలో మాత్రం ఇంకో పేషెంట్ల బంధువులెవ్వరైనా కలిస్తే ఇద్దరు కలిసి ఒక భోజనం తెప్పించుకుని చెరి సగం తింటున్నారు. ఇక రాత్రి సమయంలో నిమ్స్​, ఇతర ప్రాంతాల్లో రూ. 10 చెల్లించి ఉంటూ.. ఉదయం మళ్లీ ఆస్పత్రులకు వస్తున్నారు.

బంధువులు వద్దంటున్నారు

సిరిసిల్లకు చెందిన వృద్దురాలికి స్థానికంగానే ఓ సోదరి కూడా ఉంటోంది. కానీ “ నీ కొడుక్కు కరోనా వచ్చింది.. నువ్వు కూడా మా ఇంటికి రావద్దు” అంటూ ఎదురుగానే చెప్పడంతో ఎటూ వెళ్లలేక ఆస్పత్రి ముందే కాలం వెళ్లదీస్తోంది. లోపల ఉన్న వారు ఎప్పుడు..ఎలా బయటకు వస్తారో.. వీరు ఎప్పుడు ఇండ్లకు వెళ్తారో..!!??

Next Story