కదిలిస్తే కన్నీరే.. మల్లన్న సాగర్ నిర్వాసితుల బాధ వర్ణనాతీతం

by  |
కదిలిస్తే కన్నీరే.. మల్లన్న సాగర్ నిర్వాసితుల బాధ వర్ణనాతీతం
X

దిశ ప్రతినిధి, మెదక్: మల్లన్న సాగర్ ముంపు నిర్వాసితుల బాధలు చెప్పుకుంటే వర్ణణాతీతం. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో 50 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మిస్తున్న మలన్నసాగర్ ప్రాజెక్టులో భూములు, ఇండ్లు, ఊర్లు కోల్పోతున్న నిర్వాసితులు తమ గోడును పట్టించుకునే నాథుడే లేదంటూ ప్రభుత్వం, అధికారులపై దుమ్మెత్తి పోస్తున్నారు. తమను అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ప్రాజెక్టులో ముంచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి తమను ఒప్పించేందుకు బెదిరింపులు, భయబ్రాంతులకు గురిచేశారని, నేడు ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే తమను గ్రామాలు, ఇల్లు ఖాళీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో అధికారులు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే గ్రామాలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారని కన్నీరు పెడుతున్నారు. నిర్వాసిత గ్రామాల్లోని నిర్వాసితులను కదిలిస్తే కన్నీళ్లు కార్చుతున్నారు. నాడు అధికారుల ఇచ్చిన హామీ ప్రకారం తమ ఇండ్లకు, ఖాళీ స్థలాలకు లెక్క ప్రకారం పరిహారం ఇస్తామని చెప్పిన అధికారులు, ప్రజాప్రతినిధులు నేడు పత్తా లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇచ్చిన హామీ మేరకు పరిహారం ఇవ్వకుండానే డ్యామ్ నిర్మిస్తూ గ్రామాలకు వెళ్లే అన్ని దారులు మూసేసి తమను భయబ్రాంతులకు గురిచేస్తూ నట్టేట ముంచేస్తున్నారని, తమను పట్టించుకునే నాదుడే లేడని, ప్రతిపక్షాలు, అధికారులు లేకుండా పోయారని తమ గోడు ఏవరికి చెప్పుకునేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

పరిహారం ఇవ్వకుండా బలవంతంగా ఇండ్లు ఖాళీ

మల్లన్న సాగర్ భూనిర్వాసిత గ్రామాల్లో ఇండ్లు, ఇంటి స్థలాలు కోల్పోతున్న నిర్వాసితులకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇప్పటికి ఇవ్వలేదు. గతంలో ఇస్తామన్న హామీలను నెరవేర్చకుండానే నిర్వాసితులకు తమ ఇండ్లు నుంచి, గ్రామాలనుంచి ఖాళీ చేయించి బలవంతంగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. నిర్వాసితులకు మొదట ఇంటికి ఇల్లు, ఖాళీ స్థలాలకు ఖాళీ స్థలాలు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి పునరావాసం, పరిహారం ఇస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వం. కానీ నేడు ఎలాంటి పరిహారం, ఆవాసాలు కల్పించకుండానే గ్రామాలు, ఇండ్లు ఖాళీ చేయిస్తున్నారు. తొగుట మండలం బ్రహ్మణ బంజేరుపల్లి, వేములఘాట్, పల్లెపహాడ్ గ్రామాల్లో అధికారులు ఇప్పటికే బలవంతంగా ఇండ్లు ఖాళీ చేయిస్తున్నారు. కొన్ని ఇండ్లు కూల్చుతూ ధ్వంసం చేస్తున్నారు. గ్రామాలకు దారులు మూసి ఇతరులెవరూ గ్రామాల్లోకి రాకుండా జాగ్రత్త పడుతూ గ్రామాలు ఖాళీ చేస్తున్నారు.

హైకోర్టు ఆదేశాలు తుంగలో

మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో ఎలాంటి కూల్చివేతలు నిర్వహించకూడదని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయినా అధికారులు హైకోర్ట్ ఆదేశాలను తుంగలో తొక్కి నిర్వాసితుల ఇండ్లను గుట్టుచప్పుడు కాకుండా కూల్చివేస్తూ గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. వేములఘాట్, పల్లెపహాడ్, బంజేరుపల్లి గ్రామాల్లో నిర్వాసితులను బలవంతంగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరి కొందరు పరిహారం కోసం కోర్టును ఆశ్రయించి ఖాళీ చేయకుండా ఉన్నవాళ్లను భయ బ్రాంతులకు గూరిచేస్తూ ఖాళీ చేసిన ఇండ్లు కూల్చివేస్తున్నారు.

నిర్వాసితుల గ్రామాల్లో ఎవరిని కదిలించిన కన్నీటి వ్యధే.. తమ బాధలు వర్ణనాతీతం.. తమను ఒప్పించేందుకు అధికారులు చుట్టూ తిరిగి సంతకాలు తీసుకునే వరకు ఉన్న కలెక్టర్, ఆర్డీఓ, తహశీల్దార్, ఎమ్మెల్యే ఇప్పుడు కనబడుటలేదు. మా బాధ ఎవరికి చేప్పుకోవాలి. ఖాళీ చేస్తేనే పరిహార ఇస్తామంటుర్రు. లేదంటే ఇవ్వమంటున్నరు. ఇప్పుడే పత్తా లేని అధికారులు రేపు ఎలా ఇస్తారు .. ఎవరిని అడిగింది.. ఎవరికి చెప్పుకునేది మమ్మల్ని చెట్టుకోకరు పుట్టకోకరిని చేసిన అధికారులకు మా గోడ తగిలి మట్టికోట్టుకు పోతారంటూ శాపనార్థాలు పెడుతున్నారు.

మమ్మల్ని నట్టేట ముంచిది హరీష్ రావే: కాకల్ల నాగయ్య, నిర్వాసితుడు

బలవంతంగా మాతో సంతకాలు పెట్టించిన అధికారులు. ఇచ్చిన హామీలు నెరవేర్చ లేదు. ఆర్డీఓ, కలెక్టర్ మాట తప్పిర్రు. 18 సంవత్సరాలు నిండిన పిల్లలకు, కాళీ స్థలాలకు పరిహారం రాలేదు. అన్ని హమీలిచ్చిన గా హరీశ్ రావే మమ్మల్ని ముంచిది. సావు ఎప్పుడోస్తదోనని ఎదురుచూస్తున్న.

ఉద్యోగమిస్తమన్నరు ఒక్కటి రాలే: పుల్లకుంటి స్వామి, నిర్వాసితుడు

మమ్మల్ని ఒప్పించి సంతకాలు తీసుకున్నప్పుడు నిర్వాసితుల కుటుంబానికో ఉద్యోగం ఇస్తమన్నరు. ఇప్పటివరకు ఏ ఒక్కరికి ఉద్యోగమివ్వ లేదు. కనీసం ఇచ్చిన హమీ ప్రకారం పరిహారం ఇవ్వలేదు. రేపు ఖాళీ చేసినంక పరిహారం ఇస్తరన్న నమ్మకం లేదు.



Next Story

Most Viewed