పగవాడికి కూడా రాకూడదీ పరిస్థితి…కోవిడ్ బాధిత కుటుంబాల దీనస్థితి…

by  |
పగవాడికి కూడా రాకూడదీ పరిస్థితి…కోవిడ్ బాధిత కుటుంబాల దీనస్థితి…
X

ఆసుపత్రి స్టాఫ్: ఫలనా పేషెంట్ తాలుకు వారెవరైనా ఉన్నారా… ?
బాధితులు: ఉన్నాం ఉన్నాం సర్… ఏమైంది సర్

ఆసుపత్రి స్టాఫ్: మీరు కొంచెం ముందుకు రండి
బాధితులు: సర్ చెప్పండి, టెన్షన్ కు గురై మా వాళ్లు ఎలా ఉన్నారంటూ అదుర్దాగా ప్రశ్నల వర్షం.

ఆసుపత్రి స్టాఫ్: మెడిసిన్స్ అవసరం ఉన్నాయి, మెడికల్ స్టోర్ లో బిల్లు కట్టి వెల్లండి.
బాధితులు: మా వాళ్లకు ఎలా ఉంది సర్, మాట్లాడుతున్నాడా, ఆక్సిజన్ తీసేశారా, చికిత్సకు సహకరిస్తున్నాడా అంటూ ప్రశ్నల వర్షం.

ఆసుపత్రి స్టాఫ్ : ఏమో డాక్టర్ గారు చెప్పారు మెడిసిన్స్ కావాలని మీకు చెప్తున్నామంతే.
బాధితులు: ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోని చెప్పండి సార్ అంటూ ధైన్యంగా అభ్యర్థించడం.

ఆసుపత్రి స్టాఫ్: ఓకె ఓకె తెలుసుకుని చెప్తాం లెండి, బావున్నాడు కాబట్టే మందులు అవసరమని చెప్తున్నాం కదా అంటూ ఓ సమాధానం.
బాధితులు: ఎప్పటి వరకు డిశ్చార్జి చేస్తారు సర్.?

ఆసుపత్రి స్టాఫ్: నాకేం తెలియదు, డాక్టర్ గారు పరీక్షిస్తున్నారు, బాగా కాగానే ఇంటికి పంపిస్తారు.
బాధితులు: డాక్టర్ గారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుని చెప్పండి సర్, ఇంట్లో వాళ్లు అడుగుతున్నారు, ఎలా ఉందని ఏం చెప్పాలో తెలియడం లేదు. రోజంతా ఈ రోడ్డుపైనే పడి ఉంటున్నాను. దయచేసి పూర్తిగా తెలుసుకుని చెప్పండి సర్ అంటూ వేడుకోలు.

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఇది కరీంనగర్ జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల ముందు కనిపిస్తున్న దయనీయమైన పరిస్థితి. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని ఆసుపత్రులకు తరలించిన తరువాత చికిత్స పొందుతున్న పేషెంట్ ఎలా ఉన్నారో తెలుసుకునేందుకు వారి కుటుంబ సభ్యులు పడుతున్న ఆవేదన. అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా ప్రజల్లో నాటుకపోయిన ఈ రోగం తగ్గుతుందో లేదోనన్న ఆందోళనతో మానసిక వేదనకు గురవుతున్న వారి దైన్యం చూస్తే కన్నీరు పెట్టక మానరు. రోజుల తరబడి ఆస్పత్రి సమీపంలోని చెట్ట కింద, రోడ్ల పక్కన పడిగాపులు కాస్తూ కాలం వెల్లదీస్తున్నారు. రాత్రనక, పగలనకా కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ ఎదెురు చూస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏ ఆస్పత్రి ముందు చూసినా ఇలాంటి దయనీయ పరిస్థితులే. ఏ క్షణంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని కలవరపడుతూ మనోవేదనకు గురవుతున్న వారే.

తమ కళ్ల ముందే మీ పెషెంట్ పరిస్థితి సీరియస్ గా ఉంది వెంటనే పెద్దాసుపత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసుకోవాలని ఆస్పత్రి సిబ్బంది చెప్పిన మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి. అలాంటి పరిస్థితి తమకు ఎదురు కావద్దంటూ చెట్టు, పుట్టా, గుర్తుకు వచ్చిన దేవుళ్లను తలుచుకుంటూ మొక్కుతూ అత్యంత దయనీయమైన పరిస్థితిలో కాలం వెల్ల దీస్తున్నారు పెషెంట్ తాలుకూ అటెండెంట్స్. నిన్న రాత్రి ఇద్దరో ముగ్గురో చనిపోయారట, అర్థరాత్రి ఎవరికీ తెలియకుండా అంబులెన్స్ లో తరలించారట అంటూ పక్కనే ఉన్న మరో పెషెంట్ తాలుకు బంధువుల చర్చ. అప్పటి వరకు కొంత ప్రశాంతతో ఉన్న పక్కవారి మనసులో మళ్లీ బాధ, భగవంతుడా మా వాళ్లను అయితే క్షేమంగా ఉంచేలా చూడు స్వామి అంటూ మనసులోనే వేడుకోలు. లోపల ఉన్న పెషెంట్ పరిస్థితి ఎలా ఉందో దేవుడెరుగు, బయట ఉన్న అటెండెంట్ల పరిస్థితి మాత్రం ఇంతటి దయనీయంగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన ఒకరిద్దరు ఆస్పత్రి సమీపంలోకి వచ్చిన తమలోని బాధను చెప్పుకుని ఒకరిపై ఒకరు పడి ఏడ్వాలని ఉన్నా, ఆ మహమ్మారి ఒకరి నుండి ఒకరికి అంటుకుంటుందేమోనన్న భయంతో దూరంగా ఉంటూ మౌనంగా ఏడ్వడం తప్ప ఒకరినొకరు ఓదార్చుకోలేని పరిస్థితి. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో కరోనా బాధిత పేషెంట్ల బంధువులు ఆస్పత్రులు వద్ద కొట్టుమిట్టాడుతున్నారు.

మనవనికి ఎలా ఉందిరా…

దవాఖానల వద్ద పరిస్థితి ఇలా ఉంటే ఇంటి నుంచి వచ్చే ఫోన్లలో ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. 80 ఏళ్ళ పండు ముసలి మావోనికి చికిత్స అందించేందుకు దవాఖానకు తీసుకొచ్చినప్పటి నుండి అన్నం తినడం లేదు, నిద్రలో కూడా కలవరిస్తోందన్న విషయం తెలిసింది మరింత మానసిక వేదనకు గురువుతన్నారు. ఇదే సమయంలో చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అయింది. అరేయి మనవనికి ఎలా ఉందిరా? దవాఖానల మంచిగ ఉన్నాడా? నువ్వు పొయి సూసినవా, మాట్లాడుతున్నాడా లేచి తిరుగుతుండా అంటూ ప్రశ్నల వర్షం. అవ్వా నేను లోపలకు వెల్లి చూసే అవకాశం లేదని చెప్తే ముసల్ది ఎలా బాధపడుతుందన్న ఆవేదనతో అబద్దపు మాటలు చెప్పు మానసిక వేదనకు గురవుతున్నావారెందరో.

సర్వ సాధారణం…

ఇలాంటి దయనీయమైన పరిస్థితులు కరీంనగర్ జిల్లాలోని కోవిడ్ చికిత్స అందిస్తున్న ప్రతి ఆసుపత్రి ముందు సాక్షాత్కరిస్తున్నాయి. లోపల చికిత్స చేయించుకుంటున్న రోగుల పరిస్థితి ఎలా ఉందో అంతుచిక్కక ఆగమ్యగోచరంలో కొట్టుమిట్టాడుతున్నారు.

Next Story

Most Viewed