సికింద్రాబాద్ ప్రజలు శాంతి కాముకులు: శిల్పాచారి

by  |
YSRTP women leader
X

దిశ, సికింద్రాబాద్: నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణలో వాటి ఊసే లేకపోవడంతో ప్రజలు ఆవేదనతో ఉన్నారని, ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వైఎస్ఆర్‌టీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శిల్పా చారి అన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా నియమితురాలైన సందర్భంగా శిల్పాచారి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా అవకాశం కల్పించినందుకు అధ్యక్షురాలు షర్మిలకు కృతజ్ఞతలు తెలిపారు. తన మీద నమ్మకంతో ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించి పార్టీ ప్రతిష్టను పెంచే విధంగా పనిచేస్తానని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి నా శాయశక్తులా కృషి చేస్తానన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని అన్నారు. సికింద్రాబాద్ ప్రజలు శాంతి కామకులని, ఎల్లప్పుడూ కులమతాలకతీతంగా కలసిమెలసి ఉంటారని వివరించారు. వారి మనోభావాలకు అనుకూలంగా పనిచేస్తానని వెల్లడించారు.

కేసీఆర్ కుటుంబ పాలనతో ప్రజలంతా విసుకు చెంది ఉన్నారని అన్నారు. బలమైన ప్రతిపక్షం లేకపోవడం వలననే ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పారు. కచ్చితంగా రాబోయే ఎన్నికల నాటికి షర్మిల ఆధ్వర్యంలో వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ టీఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారుతుందని ధీమాను వ్యక్తం చేశారు. నగరంలో గానీ, రాష్ట్రంలో కానీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అభివృద్దే కనిపిస్తుందని తెలిపిన శిల్పా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి 7ఏళ్ళు పూర్తవుతున్నా చేసిన అభివృద్ధి ఏమి లేదని ఆరోపించారు.

నూతన నాయకత్వానికి అవకాశం ఇస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చి పేద ప్రజలకు న్యాయం జరగాలని అభిలాషించే వారికి మాత్రమే పార్టీ ఆహ్వానం పలుకుతుందని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ప్రజలకు మరింత చేరువ కావడానికి నిరంతరంగా పనిచేస్తానని, ఆ దిశగా తమ కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు. సంక్షేమం-సమానత్వం-స్వయం సంవృద్ది తమ పార్టీ ప్రధాన ఎజెండా అని అన్నారు. మేధావులను, యువతను, కలుపుకొని ముందుకు వెళ్తాను.


Next Story