సాగర్ సమరం: కుర్రాళ్లతో పోటీ.. జానారెడ్డికి ప్రతిష్టాత్మకం

by  |
Nagarjuna Sagar by-election
X

దిశ, తెలంగాణ బ్యూరో: నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డికి కొత్త సవాళ్లను తెచ్చి పెట్టింది. గెలిచినా.. ఓడినా ఆయన సుదీర్ఘ రాజకీయానికి అపవాదుగానే మారుతోంది. ప్రస్తుతం ప్రత్యర్థులుగా బరిలో ఉన్న ప్రధాన పోటీదారులిద్దరూ కొత్తవాళ్లే. గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం కూడా లేదు. కానీ 10 పర్యాయాలు ఎన్నికలను ఎదుర్కొని, ఏడుసార్లు విజేతగా నిలిచి, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అత్యధికంగా.. సుదీర్ఘ కాలం మంత్రిగా పని చేసిన రాజకీయ కురవృద్ధుడు కుందూరు జానారెడ్డితో ఈసారి పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో జానారెడ్డి గెలిస్తే.. కొత్తోళ్లు.. రాజకీయాల్లో కుర్రాళ్లతో పోటీ పడి గెలిచాడంటూ రాజకీయ వర్గాలు తేలిగ్గానే తీసుకుంటాయి. దీన్ని జానారెడ్డికి పెద్దగా కిరీటం పెట్టాల్సిన అవసరం లేదంటున్నారు. ఒకవేళ ఓడిపోతే మాత్రం రాజకీయాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ఓనమాలు దిద్దుతున్న యువకుల చేతిలో ఓటమిపాలయ్యాడని, ఏండ్ల తరబడి రాజకీయ అనుభవం పని చేయలేదని జానారెడ్డి రాజకీయ భవిష్యత్తులను ప్రశార్థకంలో పడేయనున్నారు. ఫలితంగా ఇక్కడ గెలిచినా.. ఓడినా జానారెడ్డికే విమర్శలు మాత్రం తప్పవు.

10 సార్లు పోటీ.. ఏడుసార్లు గెలుపు

జానారెడ్డిది నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ సమీపంలోని అనుముల గ్రామం. 1978లో అప్పటి చలకుర్తి నియోజకవర్గం నుంచి జేఎన్‌పీ నుంచి పోటీ చేసి తొలిసారి 14 వేల ఓట్లతో ఓడిపోయారు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1983లో చలకుర్తి నియోజకవర్గం నుంచి తొలిసారిగా రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి పోటీ చేసి 5వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత 1985, 1989 ఎన్నికల్లో టీడీపీ తరుపున విజయం సాధించారు. అనంతరం ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 1994 ఎన్నికల్లో మాత్రం టీడీపీ అభ్యర్థి రామ్మూర్తి యాదవ్​చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 1999లో అదే నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆరు పర్యాయాలు చలకుర్తి నుంచి శాసనసభకు ఎన్నికై వ్యవసాయం, సహకారసంఘాలు, మార్కెటింగ్, అటవీ శాఖ, పశుసంవర్ధక శాఖ, మత్స్య పరిశ్రమ, కొలతలు, తూనికలు, రవాణా, రోడ్లు, భవనాలు, గృహ, పంచాయితీ రాజ్, గ్రామీణ నీటి సదుపాయం, శుభ్రత మొదలైన వివిధ మంత్రిత్వ శాఖలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత దీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా కాసు బ్రహ్మానందరెడ్డి నెలకొల్పిన రికార్డును అధిగమించి నిలిచాడు. 2009లో ఈ సెగ్మెంట్ నాగార్జున సాగర్‌గా రూపాంతరం చెందింది. 2009, 2014 ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్​ నుంచి గెలిచారు. కానీ 2018లో మాత్రం టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల నర్సింహ్మయ్య చేతిలో 7 వేల ఓట్లతో ఓడిపోయారు.

కుర్రకారు.. పోటీదారు

ప్రస్తుతం బీజేపీ, టీఆర్‌ఎస్ నుంచి ఇద్దరు యువకులు పోటీకి దిగారు. పార్టీలు కూడా బీఫాంలు ఇచ్చాయి. నోముల నర్సింహ్మయ్య కొడుకు భగత్ టీఆర్‌ఎస్ నుంచి, డాక్టర్ రవికుమార్​నాయక్​బీజేపీ నుంచి పోటీ చేస్తుండగా.. ఇద్దరూ ఇదే ఎన్నికల్లో ఓట్ల వేటలో ఉంటున్నారు. కొంతకాలంగా రాజకీయాల్లో ఉంటున్నా ఎలక్షన్‌కు మాత్రం ఇద్దరూ కొత్తే. కానీ ప్రత్యర్థిగా బరిలో ఉన్నది మాత్రం సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జానారెడ్డి. ఈ నేపథ్యంలో జానారెడ్డి రాజకీయ వ్యూహాలు పని చేస్తాయా అనేది ఇప్పుడు ప్రత్యేకంగా మారింది. ఇప్పటి వరకైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే మెజార్టీ ఉందని అనుకుంటున్నా.. టీఆర్‌ఎస్‌కు కొంతమేర మళ్లిందనే ప్రచారం కూడా మొదలైంది. మరోవైపు పార్టీలన్నీ ఇక్కడే దృష్టి పెట్టాయి. గులాబీ బాస్​కేసీఆర్ చాలా వ్యూహాల్లో ఉన్నారు. బీజేపీ కూడా అదే ప్రయత్నం. కానీ కాంగ్రెస్​ నుంచి జానారెడ్డి మాత్రం అంతా తానై వ్యవహరిస్తున్నారు. దీంతో ఇక్కడ గెలుపు చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. చివరకు కొత్త రాజకీయం గెలుస్తుందా.. లేకా సుదీర్థ రాజకీయ అనుభవం గెలుస్తుందా అనేది ఉత్కంఠంగానే మారింది.



Next Story

Most Viewed