కన్న కొడుకులు కడతేర్చుతారేమో సారు.. కాపాడండి!

by  |
కన్న కొడుకులు కడతేర్చుతారేమో సారు.. కాపాడండి!
X

దిశ, వెబ్‌డెస్క్: తల్లిని కాపాడాల్సిన కొడుకులు కన్న బంధాన్ని మరిచారు. నవమాసాలు మోసి.. ఏండ్ల తరబడి పోషించిన అమ్మను అవమానపాలు చేశారు. ఆఖరికి హత్య చేసేందుకు కూడా వెనుకాడరన్న భయంతో ఆమె రోడ్డెక్కింది. కొడుకులు పట్టించుకోవడం లేదన్న బాధను కడుపులోనే దాచుకొని.. ఎక్కడా చంపుతారన్న భయంతో కాపాడండి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మానవత్వాన్ని మంటగలుపుతూ.. అందరి హృదయాలను చిదిమేసిన ఘటన వేములవాడ పట్టణంలో వెలుగుచూసింది.

వివరాళ్లోకి వెళితే..
సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలోని తిప్పాపూర్‌కు చెందిన సుంకపాక నర్సవ్వకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు శ్రీనివాస్ మున్సిపాలిటీలోనే పార్ట్‌టైమ్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. రెండో కుమారుడు రాజు కూడా ఉద్యోగస్తుడే. అయితే, ఇద్దరు కుమారుల వివాహం జరిగి చాలా కాలమే అయింది. సరిగ్గా ఐదేళ్ల క్రితం నర్సవ్వ భర్త మరణించాడు. అంతకుముందు నుంచే తిప్పాపూర్ గ్రామ పంచాయతీలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేసిన నర్సవ్వ వయసు పెరిగే కొద్ది పనిచేయడం కష్టతరమైంది. అయినప్పటికీ బతుకుజీవుడా అంటూ కాలం వెల్లదీస్తూ వచ్చింది. కానీ, కొడుకులున్నారన్న ఆశతో, చూసుకుంటారులే అన్న ధీమాతో కొడుకుల ఇంట్లోనే గత కొంత కాలంగా కాలం వెల్లదీస్తుంది.

కానీ, కన్న కొడుకులు మాత్రం తల్లిని సక్రమంగా చూడలేదు. గత 10 నెలలుగా వారి ఇంట్లోనే ఉంటుందని.. తల్లి పై ప్రేమ, కనికరం లేకుండా భార్యలతో కలిసి రోడ్డు మీదకు నెట్టారు. కన్న కొడుకులు ఇంట్లో నుంచి గెంటేయ్యగానే ఆమె మనస్సు ఎంత చలించిపోయిందో వర్ణణాతీతం. చేసేదేమి లేక చేతగాని వయస్సులో కన్నీళ్లు మాత్రమే పెట్టుకుంది. తనకు న్యాయం చేయాలని ఎక్కి ఎక్కి ఏడ్చింది. ఈ నేపథ్యంలోనే తన గోడును వెల్లబోసుకుంటూ వేములవాడ పట్టణంలో ప్ల కార్లులు, పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపింది. వృద్ధురాలి గోడు చూసిన పట్టణ సీఐ వెంకటేశ్ ఆమెను ఓదార్చారు. కుమారులను పిలిపించి మాట్లాడుతానని నచ్చజెప్పారు. ఏది ఏమైనా తల్లిని రోడ్డు మీదకు నెట్టేస్తారా.. అసలు మీరు కొడుకులేనా అంటూ స్థానిక జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు.

Next Story