అనుమానం.. అవమానం.. వలస గోస 

by  |
అనుమానం.. అవమానం.. వలస గోస 
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా లాక్‌‌డౌన్ కారణంగా ఆదాయం కోల్పోయారు. ఇతర ప్రాంతంలో ఇబ్బందులు పడేబదులు సొంతూర్లకు వచ్చి బతుకుదామనుకున్నారు. కానీ వారికి అక్కడా కష్టాలు తప్పడం లేదు. కరోనా అంటుకుంటే లేనిపోని అవస్థలు వస్తాయని, గడప‌లోపే ఉండి ఉన్నదే తిని బతుకుదామనుకుని వచ్చిన వాళ్లకు అనుమానపు చూపులతో అవమానాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వాలు ఇచ్చే సాయం అందడం లేదు. భోరసా కల్పించే దిక్కులేక ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణకు వచ్చిన వలస కార్మికులు ఆవేదన చెందుతున్నారు.

తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వలస కార్మికులు లాక్‌డౌన్ దెబ్బకు ఆగమవుతున్నారు. అక్కడ చేస్తున్న పనులు ఆగిపోయాయి. కంపెనీలు మూతపడ్డాయి. జీతాలు లేవు. ఇల్లు గడవడం లేదు. సామూహిక మరుగుదొడ్లు, స్నానపు గదులు, కాళ్లు చాచుకుంటే అడ్డొచ్చే గోడలు.. వారిని మానసికంగా కుంగదీశాయి. ఏ విధంగా, ఎప్పుడు తమకు కరోనా వస్తుందో.. దేశం గాని దేశంలో ఎన్ని అవస్థలు పడాలోనని ఆవేదన చెందారు. కనీసం చేసిపెట్టే దిక్కులేక ఎట్లాంటి చావు వస్తుందోనని భయంతో సొంతూరు బాట వెతుకున్నారు. అసలే లాక్‌డౌన్.. ఉన్న చిన్న పాటి వెసులుబాటును వాడుకుని లక్షలు సంపాదించాలని ప్రైవేటు ట్రావెల్ ఏజెన్సీలు చూస్తున్నాయి. డబ్బులు పోయిన సరేనని కిందో మీదో పడి స్వరాష్ట్రానికి చేరుకున్నారు. అక్కడే అసలు కష్టాలు మొదలయ్యాయి. పెనం మీద నుంచి తప్పించుకుంటే పొయ్యిలో పడ్డట్టయ్యింది తమ పరిస్థితి అని క్వారెంటైన్ రోజులు గడుపుతున్న తెలంగాణ వలస కార్మికులు వాపోతున్నారు.

‘జగిత్యాల జిల్లా తక్కళ్లపల్లి మండలానికి చెందిన నలుగురు సభ్యులున్న కుటుంబం జీవనోపాధి కోసం కొన్నేండ్ల క్రితం ముంబాయికి వెళ్లింది. అప్పటి నుంచి ఇల్లు ఖాళీగా ఉంది. లాక్‌డౌన్ విధించిన నెల రోజుల తర్వాత కొన్ని సడలింపులు రావడంతో ఓ ప్రైవేటు బస్సులో సొంతూరికి చేరుకున్నారు. ఇంట్లో బియ్యం, ఇతర సరుకులు లేవు. ఇంట్లో ఉన్న వాళ్లందరూ ఏండ్ల తర్వాత ఒకేసారి రావడంతో మళ్లీ కొత్త కాపురం పెట్టినట్టయింది. వీళ్లు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. వచ్చేటపుడే రాష్ట్ర సరిహద్దుల్లో హోం క్వారెంటైన్ ముద్రలు వేశారు. దీంతో ఇప్పుడు వారంతా ఇంటికే పరిమితమయ్యారు. బయట కాలు పెట్టే పరిస్థితి లేదు. బంధువుల ఇండ్లల్లో బియ్యం బదులు తెప్పించుకుని తింటున్నారు. కూరగాయలు, ఇతర అవసరాలు ఏవీ ఉన్నా ఎవరినో ఒకరికి ఫోన్ చేసి పిలుపించుకోవాల్సిన పరిస్థితి. అందరూ అన్ని సార్లు వస్తారా.. వాళ్లకు సైతం పనులుంటాయి కదా.. అంటారు ఆ ఇంటి పెద్దాయన. కనీసం ఇంటి పక్కల వాళ్లతోనూ మాట్లాడేందుకు అవకాశం లేకుండా పోయింది. ఆ నలుగురు ఉన్నది వండుకోవడం.. తినడం.. ఇంట్లో గడపటం.. రేషన్ కార్డులో ఇద్దరి పేర్లు మాత్రమే ఉన్నాయి. అక్కడే బతుకుతున్నాం కదా అని మిగిలిన ఇద్దరు పేర్లను వారు రాయించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తామన్న బియ్యం, డబ్బులు ఏవీ రాలేదు. వైద్య సిబ్బంది మాత్రం వచ్చి పరీక్షలు చేస్తున్నారు. కానీ కుటుంబానికి కావాల్సిన అవసరాలు చూసేవాళ్లేవరూ ఇంత వరకూ ఆ ఇంటి ఛాయలకు కూడా రాలేదు. ఈ ఒక్క కుటుంబమే కాదు.. జగిత్యాల జిల్లా పరిధిలోనే ఈ లాక్‌డౌన్ రోజుల్లో సుమారు 3,500 కుటుంబాలు ముంబై నుంచి వచ్చాయి. అనేక కుటుంబాలు హోం క్వారెంటైన్‌తో తీవ్ర అవస్థలు పడుతున్నాయి. రాష్ట్రంలోని ఒక జగిత్యాల జిల్లా నుంచి భీవండి, షోలాపూర్, ముంబాయి, పూణే తదితర ప్రాంతాలకు సుమారు 25 వేల కుటుంబాలు వలస వెళ్లినట్టు తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే సమయంలో బయటపడింది. వాళ్లంతా ఇండ్లకు చేరితే ప్రభుత్వం చేసే కార్యక్రమాలేవీ అంచుకు సైతం సరిపోవని ఓ ప్రభుత్వాధికారి చెప్పుకొచ్చారు.

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఇటీవలే రాష్ట్రానికి వచ్చాడు. పని చేస్తున్న కంపెనీ మూతపడటంతో రెండు నెలలుగా జీతం ఇవ్వడం లేదు. ప్రైవేటు బస్సులో రూ.7వేలు ఛార్జి చెల్లించి ఊరికి వచ్చాడు. (ముంబాయికి రైల్లో, బస్సులో వెళ్లినా గరిష్ట ఖర్చు రూ.వెయ్యి దాటదు) రాగానే ఊరిలో ఉన్న ప్రభుత్వ స్కూల్‌లో 14 రోజులు క్వారెంటైన్ విధించారు. ప్రభుత్వం నుంచి నీళ్లు సైతం అందలేదని అతడు వాపోతున్నాడు. ఇంటి నుంచి అతని అమ్మ వండుకొచ్చిన అన్నాన్ని స్కూల్ గేట్‌లో నుంచి ఇచ్చేది. నీళ్లు కూడా అంతే.. ఇంటి వద్ద నుంచే తెచ్చి అక్కడ పెడితే అతను తీసుకోవాలి. వైద్య పరీక్షలంటే రోజూ వచ్చి టెంపరేచర్ టెస్ట్ చేయడం, జలుబు, జ్వరం ఉందా? లేదా? చూడటం.. కనీసం కొవిడ్ కిట్‌తో పరీక్షించి ఇంటికి పంపించాలన్న విన్నపాన్ని పట్టించుకున్నవారే లేరన్నది అతడి కంప్లయింట్. రెండు రోజుల క్రితం అతడిని స్కూల్ నుంచి హోం క్వారెంటైన్‌కు తరలించారు. ఇక అప్పటి నుంచి పక్క ఇండ్ల వారి అనుమానపు చూపులు, వీధిలో వారి వేధింపులు ఎక్కువయ్యాయి. కూరగాయాలు తెచ్చేందుకో, వీధిలోని కిరాణదుకాణానికి కుటుంబ సభ్యులు వెళ్తే రావద్దని చెబుతున్నారు. తమ ఇంటి వైపు గోడ చాటు నుంచి రహస్యంగా చూస్తుండటం, గుసగుసలాడుతూ ప్రచారం చేస్తున్నారని అతడు ఆవేదన చెందుతున్నాడు. ఓ దశలో అక్కడి తహశీల్దార్‌కు ఫిర్యాదు చేయడంతో స్వయంగా గ్రామానికి వచ్చి దుకాణదారులకు అవగాహన కల్పించారు. రేషన్ కార్డుదారులకు గానీ, వలస కూలీలకు గానీ ప్రభుత్వమిస్తామన్నా ఏ సాయం వీరికి అందలేదు. గ్రామంలో రేషన్ కార్డు ఉన్నప్పటికీ మూడు నెలల నుంచి రేషన్ తీసుకోలేదని నిబంధన ప్రకారం కార్డును హోల్డ్‌లో పెట్టారు. ఉపాధి కోసమని ముంబాయికి వెళ్లిన తాను నెలకోసారి బియ్యం కోసం రాలేకపోయానని అతడు చెబుతున్నాడు. రేషన్ కార్డుదారులు ఉన్నవారితో పాటు ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు కూడా 12కిలోల బియ్యం, ఆర్థిక సాయాన్ని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. స్వంత రాష్ట్రానికి చెందిన ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హోం క్వారెంటైన్‌లో ఉన్నవారు ఆరోపిస్తున్నారు. కనీసం రేషన్ సరుకులు సైతం అందించుకుంటే తాము ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. గతంలో కంటైన్‌మెంట్ జోన్లలో ఉన్నవారికి కావాల్సిన వస్తువులను ప్రభుత్వమే సరఫరా చేసిందని, తమకు మాత్రం ఇది అమలు చేయడం లేదని వారు వాపోతున్నారు. కరోనా లక్షణాలు లేకపోయినా గ్రామాల్లో, చుట్టుపక్కల వారు అవమానకరంగా, అసహ్యంగా వ్యవహరిస్తున్నారని, కనీసం వారిలో అవగాహన కల్పించాలని కోరుతున్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని.. అయినా తమ మానసిక వేదనను పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు.

Next Story