అధికారుల బదిలీల పై కేసీఆర్ కసరత్తు.. భారీ మార్పులకు ఏర్పాట్లు షురూ..

by  |
CM KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో: దాదాపు మూడేండ్లుగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తున్నది. ఒకరిద్దరు తప్ప పరిపాలనాపరంగా ప్రక్షాళన జరగలేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణంతో ఆలస్యమవుతున్నది. ఎమ్మెల్సీ కౌంటింగ్ ఈ నెల 14న ముగిసి కోడ్ గడువు పూర్తికాగానే భారీ స్థాయిలో బదిలీ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఐదారేండ్లుగా ఒకే పోస్టులో పలువురు అధికారులు కొనసాగుతున్నారు. వారికి స్థానచలనం కలిగించాలని, సమర్ధతను ప్రధాన ప్రామాణికంగా తీసుకుని కొత్తగా పోస్టింగ్‌లు ఇవ్వాలనుకుంటున్నది. ఇప్పటికే 43 మంది ఐఏఎస్, 40 మందికిపైగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసే జాబితా సిద్దమైంది. ముఖ్యమంత్రి ఆమోదం లభించగానే జీవో జారీ కానున్నట్లు సచివాలయ వర్గాలు పేర్కొన్నాయి.

కోడ్ ముగియగానే..

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఈ నెల 16వ తేదీతో ముగియనున్నది. రానున్నది ఎన్నికల సీజన్ కావడంతో ఇప్పుడు జరిగే బదిలీ ప్రక్రియ ప్రభుత్వ నిర్ణయాలను సమర్థంగా నిర్వహించడం, సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయడం, ప్రభుత్వ ప్రాధాన్యాలకు తగినట్లుగా విధులు నిర్వర్తించడం లాంటివే కొత్త పోస్టింగ్‌లలో కీలకం కానున్నాయి. ఆయా శాఖల కార్యదర్శుల మొదలు కమిషనర్లు, డైరెక్టర్లు, జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లు.. ఇలా అన్ని స్థాయిల్లోని అధికారులు జాబితాలో ఉన్నట్లు సూచనప్రాయంగా తెలిపాయి. సాధారణ పరిపాలనా శాఖ దగ్గర ఈ జాబితా మొత్తం రెడీగా ఉందని, ముఖ్యమంత్రి ఓకే చెప్పడంతోనే జీవోలు వెలువడతాయని, ఈసారి వాయిదా పడడానికి ఆస్కారం తక్కువేనని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

రెవెన్యూకు సీనియర్ అధికారి

రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ బాధ్యతను సీనియర్ అధికారికి అప్పజెప్పాలనుకుంటున్నది. ఆ శాఖ ద్వారా ఆదాయాన్ని ఆర్జించడంతో పాటు ‘ధరణి’లో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించడం కీలకంగా మారింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావుకు ఆ బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందంటూ సచివాలయంలో చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం రెవెన్యూ శాఖను ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమారే నిర్వహిస్తున్నారు. భారీ స్థాయిలో సంక్షేమానికి ఆదాయ వనరులు అవసరమైన నేపథ్యంలో ఆర్థిక శాఖకు కూడా సమర్థుడైన అధికారిని కేటాయించనున్నట్లు తెలిసింది.

ఇదే ఫైనల్ బదిలీ

రెండేండ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున మరోసారి బదిలీ అవసరం లేకుండా వన్‌టైమ్ పద్ధతిలో భారీగానే ట్రాన్స్‌ఫర్లు జరగనున్నట్లు సమాచారం. కొన్ని అపరిష్కృత హామీలతో పాటు దళితబంధు పటిష్ట అమలుపై సర్కారు దృష్టి పెట్టింది. వడ్ల కొనుగోలు అంశంలో కేంద్రాన్ని ఎక్స్‌పోజ్ చేసే రాజకీయపరమైన అంశం ఎలా ఉన్నా రైతుల్లో తలెత్తిన గందరగోళం, ఇకపైన వారిలో కాన్ఫిడెన్సును పెంచడంపై దృష్టి పెట్టనున్నది. పథకాల అమలు, ప్రజల్లో అసంతృప్తి, పట్టు పెంచుకోవాల్సిన అవసరం తదితరాలను దృష్టిలో పెట్టుకుని అధికారులకు పోస్టింగ్ ఇవ్వనున్నది. కొన్ని డిపార్టుమెంట్లలో ఇప్పటికీ రిటైర్ అయిన అధికారులే ఇన్ చార్జిలుగా ఉన్నారు. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఉత్సాహంగా పనిచేసేవారిని కేటాయించే అవకాశం ఉన్నది.

Next Story

Most Viewed