గెలుపే లక్ష్యం.. హుజురాబాద్‌కు సర్కార్ వరాల జల్లు

by  |
Huzurabad by-elections
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీలో, కేసీఆర్ సర్కారులో కీలకంగా ఉన్న ఈటల రాజేందర్ ఆ పార్టీకి, ఆ ప్రభుత్వానికి దూరం కావడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఈ సెగ్మెంట్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తుందనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. గెలుపు అటు ఈటలకు, ఇటు కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు ప్రతిష్టాత్మకంగా తయారైంది. దీంతో ప్రభుత్వం ఇక్కడ నిధుల వరదను పారించింది. సంచలనాత్మక పథకాలనూ ప్రవేశపెట్టింది. మునుపెన్నడూ లేని విధంగా హుజూరాబాద్‌కు అనధికారికంగా ఒక బడ్జెట్‌నే రూపొందించింది. రెండు నెలల వ్యవధిలోనే భారీగా నిధులను విడుదల చేసింది. వెరసి ఒక చరిత్రనే సృష్టించింది.

సంక్షేమ పథకాలకు రూ. 960 కోట్లు

ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క ఏడాది.. అందులోనూ రెండు నెలల కాలంలో ఏకంగా రూ. 960 కోట్లు కేటాయించారు. ఇందులోనూ రూ. 410 కోట్ల బిల్లులు ఇప్పటికే చెల్లించారు. ఇంకో రూ. 190 కోట్లకు పరిపాలనా అనుమతులిచ్చారు. ఉప ఎన్నికలో గెలుపు కోసం హుజూరాబాద్​లో సర్కారు సొమ్ము కుంభవృష్టి కురిసినట్లు కురిసింది. గ్రామాల్లో ఇంటింటికీ సీసీ రోడ్లు నిర్మించారు. డ్రైనేజీలు ఏర్పాటయ్యాయి. వీధిలైట్లు వెలిగించారు. ఈ సంక్షేమ పథకాలకు అదనంగా రూ. 10 కోట్ల వరకు విద్యుత్​ శాఖ ఈ సెగ్మెంట్‌లో పనులు చేసింది. ఏండ్ల నుంచి పెండింగ్​లో ఉన్న మీటర్లు, వ్యవసాయ విద్యుత్​ కనెక్షన్లు ఇచ్చారు.

సాగర్‌లో ఆగింది.. హుజురాబాద్‌లో మొదలైంది

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత గొర్రెల పంపిణీ ఆగిపోయింది. అప్పటికే దాదాపు 32 వేల మంది లబ్ధిదారులు డీడీలు చెల్లించి రెడీగా ఉన్నారు. కానీ ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేయలేదు. కానీ హుజురాబాద్​ వేదికగా రెండో విడుత గొర్రెల పంపిణీ మొదలైంది. దీని కోసం రూ. 6 వేల కోట్లను కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్​ ప్రకటించారు. ఇదే క్రమంలో హుజురాబాద్​ నియోజకవర్గంలో 2874 మంది డీడీలు చెల్లించిన వారికి గొర్రెలిచ్చారు. ఈ సెగ్మెంట్​లో మొత్తం 4,500 లబ్ధిదారులకు రూ. 78.75 కోట్లతో గొర్లు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇక దళిత బంధు పథకం హుజురాబాద్​ కోసమే పురుడు పోసుకుంది. ఇప్పటికే ఈ నియోజకవర్గానికి రూ. 2వేల కోట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ స్కీం పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో ప్రయోగాలు చేసింది. దీనికి ప్రధాన కారణం ఇక్కడ సుమారు 40 వేలకుపైగా దళితుల ఓట్లు ఉండటమే. ‘దళిత బంధు’ పథకానికి రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు రూ. 1,200 కోట్లను ఖర్చు పెట్టాలనుకుంటున్న ప్రభుత్వం కేవలం హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రం గరిష్ఠంగా సుమారు రూ. 2,000 కోట్లను ఖర్చు చేస్తోంది. రాష్ట్రం మొత్తంమీద ఈ పథకం కింద చేయాలనుకుంటున్న ఖర్చు కంటే ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గానికే ఎక్కువ కేటాయించారు.

పరిషత్తులకు రూ. 220 కోట్లు

కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ వరకు ప్రభుత్వం సుమారు రూ. 220 కోట్లకు పైగానే వెచ్చిస్తోంది. వీటిలో 90 శాతం నిధులకు ఆర్థిక అనుమతులు మంజూరు చేసింది. పంచాయతీ భవనాలకు నిధులిచ్చారు. కొత్త పంచాయతీ భవనాల నిర్మాణాలు మొదలయ్యాయి. ఈ సెగ్మెంట్​లో మొత్తం సంక్షేమ పథకాల నిధుల కింద ఇప్పటికే సుమారు రూ. 410 కోట్ల మేర విడుదలయ్యాయి. మానేరు రివర్ ఫ్రంట్ పథకానికి రూ. 310 కోట్లు, హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లకు రూ. 35 కోట్లు, జమ్మికుంట మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 30 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఇక రాష్ట్రంలో ఆసరా పింఛన్లకు వయో పరిమితిని 57 ఏళ్ళకు కుదించినా.. అంతటా బ్యాన్​ విధించింది. కానీ హుజురాబాద్‌కు మాత్రం దరఖాస్తు చేసుకున్న వెంటనే విడుదల చేసింది. మరోవైపు కొత్త రేషన్​ కార్డులు, కొత్త పింఛన్లు విడుదలయ్యాయి. అంతేకాకుండా మహిళా సంఘాలకు భవనాలు ఇచ్చారు. ఏడేండ్ల నుంచి పునాదుల్లో మూలుగుతున్న మహిళా సంఘ భవనాలను ఇటీవల పూర్తి చేసేందుకు అదనపు నిధులిచ్చారు.

మరోవైపు 2018 నుంచి మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ ఇవ్వని ప్రభుత్వం.. హుజురాబాద్​ నియోజకవర్గంలో మాత్రం రూ. 120 కోట్లు చెల్లించింది. వీటిని మంత్రులు అంగరంగ వైభవంగా పంపిణీ చేశారు.

కుల భవనాలు

ఇక కుల సంఘాలకు భవనాలకు భూమితో పాటుగా రూ. 50 లక్షల నుండి కోటి రూపాయలను కూడా ఇస్తున్నారు. ఏండ్ల నుంచి పెండింగ్​లో ఉన్న ఆటో గ్యారేజికి మూడు ఎకరాల స్థలం పత్రాలు కూడా అందించారు. అయితే దళితబంధు ప్రభావం మిగతా కులాలపై పడకుండా జాగ్రత్తలు తీసుకునే క్రమంలో అన్ని కులాలకు ఈ చాన్స్​ దక్కింది. ఉపఎన్నిక పరిధిలో ఏ వర్గమూ నొచ్చుకోకుండా వారిని సంతృప్తి పరిచేందుకు కష్టపడ్డారు. దీంతో ఇక్కడ కుల సంఘాలు అడిగితే.. కాదనకుండా హామీలు కురిపిస్తున్నారు. యాదవ సామాజికవర్గాలకు గొర్రెలను పంపిణీ చేశారు. యాదవ భవనాలు కట్టేందుకు స్థలంతోపాటు నిధులు కూడా ఇచ్చారు. పద్మశాలీ, నాయిబ్రాహ్మణ, రెడ్డి, కాపు, వైశ్య, గౌడ సామాజికవర్గాలకు చెందిన ప్రతినిధులతోనూ మంత్రులు నిత్యం సమావేశాలు నిర్వహించడం పరిపాటిగా మారింది. ఈటల రాజేందర్‌ సామాజికవర్గమైన ముదిరాజ్‌ కులంపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవల రెడ్డి కుల ఆత్మీయ సభను సైతం నిర్వహించారు. ఈ కుల సంఘాల కోసం దాదాపు రూ. 15 కోట్ల వరకు వెచ్చించారు.

కాగా నియోజకవర్గంలో 46 వేల మంది ఎస్సీ ఓటర్లు ఉన్నట్లు లెక్క తేల్చారు. ఆ తరువాత అత్యధికంగా మున్నూరుకాపు ఓటర్లు 29 వేల వరకు ఉన్నట్లు అంచనా. ఇతర సామాజిక వర్గాల్లో పద్మశాలి (26 వేలు), గౌడ (24 వేలు), ముదిరాజ్‌ (23 వేలు), యాదవ (22 వేలు)తోపాటు రెడ్డి (22,600) సామాజిక వర్గాలకు కూడా గెలుపు, ఓటములను ప్రభావితం చేసే స్థాయి ఓటర్లున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు నాయీ బ్రాహ్మణ, ఎస్టీలు, రజక, మైనారిటీ తదితర వర్గాలకు చెందిన వారు 35 వేల వరకు ఉంటారని అంచనా. మున్నూరు కాపు, రజక సామాజిక వర్గాల ఆత్మగౌరవ భవనాలకు ఎకరా స్థలం, రూ.50 లక్షల నిధులు చొప్పున ఇచ్చారు. గౌడ సంఘానికి ఎకరా స్థలంతో పాటు రూ. కోటిని మంజూరు ఉత్తర్వులను మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు గంగుల, కొప్పుల అందించారు. మహిళా ఆత్మగౌరవ భవనానికి కూడా ఎకరా స్థలం, రూ.కోటి మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వైశ్య సామాజిక వర్గానికి భవనం కోసం ఎకరా స్థలాన్ని కేటాయించారు.

నిధులు ఇలా

సీసీ రోడ్లు, డ్రైనేజీలు, లింక్​ రోడ్లు రూ. 220 కోట్లు
కుల సంఘాలకు భూమి, నిధులు రూ. 15 కోట్లపైనే
గొర్రెల పంపిణీకి రూ. 78.75 కోట్లు
హుజురాబాద్​ మున్సిపాలిటికి రూ. 35 కోట్లు
జమ్మికుంట మున్సిపాలిటీకి రూ. 30 కోట్లు
జిల్లా, మండల పరిషత్తులకు రూ. 220 కోట్లు
దళిత బంధు స్కీం రూ. 2000 కోట్లు

సంక్షేమ పథకాలకు మొత్తం రూ. 960 కోట్లు
ఇప్పటి వరకు విడుదలైన నిధులు రూ. 410 కోట్లు
పరిపాలనా అనుమతులు జారీ చేసినవి రూ. 190 కోట్లు
మానేరు రివర్​ ఫ్రంట్​ కింద కాల్వలకు రూ. 360 కోట్లు

విద్యుత్ శాఖ నిధులు రూ. 10 కోట్ల వరకు
మహిళలకు వడ్డీ రాయితీ నిధులు రూ. 120 కోట్లు

Next Story

Most Viewed