వెయ్యిమంది రైతులతో సీపీఎం ధర్నా.. డిమాండ్ ఇదే

by  |
CPM-leaders
X

దిశ, భూపాలపల్లి: రైతులు సాగుచేసుకుంటున్న అసైన్డ్, పోడు, పోరంబోకు, దేవాదాయ భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జె.వెంకటేష్, జిల్లా కార్యదర్శి సాయిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సాగుదారులకు భూమి పట్టాలు ఇవ్వాలని, రైతుబంధు అమలు చేయాలని, పలు ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందజేయాలని సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జాయింట్ కలెక్టర్‌కు అందజేశారు. అనంతరం సీపీఎం నేత వెంకటేష్ మాట్లాడుతూ… సాగు చేసుకుంటున్న రైతులందరికీ పట్టాలు ఇచ్చి, రైతుబంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా.. అక్రమంగా ప్రభుత్వ భూములు పట్టా చేయించుకొని రైతుబంధు పొందుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ట్రాక్టర్లను అనుమతి ఇవ్వాలని, ఫారెస్ట్ అధికారులు పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరారు.

మొగుళ్లపల్లి మండలం రంగాపురం నుండి చిట్యాల, టేకుమట్ల మండలాల్లో నాలుగులైన్ల రోడ్డు కింద భూములు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందజేసి, ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టుల భూ నిర్వాసితులకు ఎకరానికి 15 లక్షలు ఇవ్వాలని, జిల్లాలో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు అక్రమంగా కబ్జా చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కేసులు పెట్టాలని అన్నారు. ఉపాధి హామీ చట్టంలోని పనిదినాలను 200 లకు పెంచాలని, రోజువారి వేతనం రూ.600 లకు పెంచాలని కోరారు. ఈ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో జిల్లా కమిటీ సభ్యులు పొలం రాజేందర్, వెలిశెట్టి రాజయ్య, కంపెటి రాజయ్య, బొట్ల చక్రపాణి, రమేష్, గుర్రం దేవేందర్, దామెర కిరణ్, చింతల రజనీకాంత్, సూదుల శంకర్, చల్లా చంద్రారెడ్డి, చేపూరి ఓదేలు, పోలం శ్రీనివాస్, సదానందం, తిరుపతమ్మ, రాజమ్మ వీరితో పాటు 1000 మంది రైతులు పాల్గొన్నారు.



Next Story