పీవీ కుటుంబం అరుదైన రికార్డు.. ఒకే ఫ్యామిలీ నుంచి..

by  |
Pv Narasimha Rao
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: భారత ఆర్థిక పితామహుడు, గాంధేతర కుటుంబం నుండి ఐదేళ్ల పాటు సుస్థిర పాలన అందించిన స్వర్గీయ పీవీ నరసింహరావు కుటుంబం ఒక అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఒకే కుటుంబం నుండి నలుగురు చట్ట సభలకు ఎన్నికైన ఫ్యామిలీగా చరిత్రలో స్థానం సంపాదించుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పీవీ నరసింహరావు మంథని నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర కేబినెట్‌లో పలు శాఖలకు ప్రాతినిథ్యం వహించి ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత లోకసభ సభ్యునిగా ఎన్నికై కేంద్ర మంత్రివర్గంలో పలు శాఖల మంత్రిగా పని చేసి ప్రధానిగానూ పని చేశారు.

ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన పెద్ద కొడుకు పీవీ రంగారావు హన్మకొండ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. ఇదే సమయంలో ఆయన మరో కొడుకు పీవీ రాజేశ్వర్‌రావు సికింద్రాబాద్ నుండి లోకసభ సభ్యునిగా గెలిచారు. పదేళ్ల క్రితం రాష్ట్రంలో మండలి పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. అప్పుడు పీవీ రంగారావు నామినేటెడ్ ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగు పెట్టారు. తాజాగా పీవీ తనయ సురభి వాణీదేవి గ్రాడ్యూయేట్ కానిస్టెన్సీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఒకే కుటుంబం నుండి నలగురు చట్ట సభలకు ప్రాతినిథ్యం వహించడం అరుదేనని చెప్పక తప్పదు.

ఆ ఒక్కటి మిగిలింది..

భారత ప్రజాస్వామ్య విధానంలో రాజ్యసభ, లోకసభలు ఉండగా రాష్ట్రంలో విధానసభ, విధాన పరిషత్‌లు ఉంటాయి. అయితే వీటిలో మూడు సభలకు పీవీ కుటుంబం ప్రాతినిథ్యం వహించింది. ఇక వారిలో ఎవరైనా రాజ్యసభకు ఎన్నికైతే ఆ కుటుంబం నాలుగు సభల్లోనూ అడుగు పెట్టిన చరిత్రను సొంతం చేసుకునే అవకాశం ఉంది.

Next Story