ఎన్నికల తీరు మారాలి.. నోట్ల కట్టల ప్రభావం తగ్గాల్సిందే..

by  |
ఎన్నికల తీరు మారాలి.. నోట్ల కట్టల ప్రభావం తగ్గాల్సిందే..
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలోనే బలమైన, గొప్ప ప్రజాస్వామ్యంగా మనం అభివర్ణించుకుంటున్నప్పటికీ గత కొంతకాలంగా పెడధోరణి పెరిగిందని, ధనవంతుల రాజకీయ క్రీడగా మారిపోయిందని మేధావులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణలో సమూల మార్పు రావాలని, ప్రక్షాళన జరగాలని, కేంద్ర ఎన్నికల కమిషన్ స్వీయ విశ్లేషణ చేయాలని అభిప్రాయపడ్డారు.

ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ‘సెంటర్ ఫర్ మీడియా స్టడీస్‘ చైర్మన్ డాక్టర్ ఎన్. భాస్కరరావు రాసిన ‘నెక్స్ట్ బిగ్ గేమ్ ఛేంజర్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా’ పుస్తకావిష్కరణ సందర్భంగా ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో పాటు సీనియర్ పాత్రికేయులు, ప్రొఫెసర్లు వ్యాఖ్యానించారు.

అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య (రిటైర్డ్ ఐఏఎస్ అధికారి) అధ్యక్షతన జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ్, కేంద్ర సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్, సీనియర్ సంపాదకులు డాక్టర్ కె.రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రొఫెసర్ పద్మజా షా, ప్రొఫెసర్ చిన్నయసూరి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తదితరులు హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికల నిర్వహణ కీలకమైన ఘట్టమని, కానీ కళ్ళ ముందే అపహాస్యం పాలవుతున్నా గొంతు విప్పలేకపోతున్నామని, మౌనంగా భరిస్తున్నామని, ఈ మౌనం అర్థాంగీకారం అనే సందేశాన్ని ఇవ్వడం మాత్రమే కాక జరుగుతున్న ఘోరాలకు వత్తాసు పలికిలనట్లవుతున్నదన్నారు. నేరానికి పాల్పడిన నేరస్తులకు బలం ఇస్తున్నట్లు అవుతున్నదన్నారు.

ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ.. ఎన్నికలు జరిగేంత వరకూ పోటీ చేస్తున్న అభ్యర్థులుగానీ, రాజకీయ పార్టీల నేతలుగానీ నోట్ల కట్టల గురించి, చేస్తున్న ఖర్చు గురించి మాట్లాడడంలేదని, ఫలితాలు వెలువడిన తర్వాత మాత్రం ఎంత ఖర్చు పెట్టినదీ సందర్భానుసారం వ్యాఖ్యానిస్తున్నారని, దీనిపైన సమాజంలో విస్తృత స్థాయిలో చర్చ జరగాలన్నారు.

ప్రముఖ ఆర్థిక వేత్త హనుమాన్ చౌదరి మాట్లాడుతూ.. కేవలం ఓట్లను దృష్టిలో పెట్టుకునే రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోల ద్వారా ప్రజలను మభ్య పెట్టేలా ‘ఉచితం’ హామీలను గుప్పిస్తున్నాయని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని, దీన్ని ఎన్నికల సంఘం సీరియస్ అంశంగా పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను కూడా పోటీచేశానని, దాదాపు రూ. 100 కోట్ల మేర ఖర్చయిందని, ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులు పోటీ చేయడం సాధ్యమేనా అని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రొఫెసర్ చిన్నయసూరి మాట్లాడుతూ, భారతదేశంలోనేగాక అనేక దేశాల్లోనూ ఎన్నికల నిర్వహణలో ఇలాంటి సవాళ్ళు ఉన్నాయని, పెడధోరణలు ప్రబలాయన్నారు. కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి ఆ పుస్తకంలోని అనేక అంశాలను సోదాహరణంగా వివరించారు. గత ఎన్నికల అనుభవాలను ప్రస్తావించారు.


Next Story