జిల్లా పీఠం మళ్లీ ఆ సామాజిక వర్గానికేనా..? టీఆర్ఎస్‌లో అంతర్గత లొల్లి..?

171
trs 1

దిశ ప్రతినిధి, నల్లగొండ: టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే నల్లగొండ జిల్లావ్యాప్తంగా వార్డు, గ్రామ, మండల కమిటీలు పూర్తికావొచ్చాయి. ఇక మిగిలిందే.. జిల్లా అధ్యక్ష పీఠం ఎక్కేది ఎవరు అన్నదే ప్రధాన చర్చ. అయితే ప్రస్తుతం ఆ చర్చే నల్లగొండ జిల్లా అధికార పార్టీ టీఆర్ఎస్‌లో ముసలం పుట్టిస్తోంది. గత దశాబ్ద కాలంగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను ఒకే సామాజిక వర్గానికి కట్టబెడుతూ వచ్చారు. పార్టీ కోసం ఇతర సామాజిక వర్గాల నుంచి కష్టపడిన వారు కొకొల్లలు. అయినా వారందరినీ పక్కకు నెడుతూ తిరిగి ఈసారి అదే సామాజిక వర్గానికి చెందిన నేతకు జిల్లా అధ్యక్ష పీఠం కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై క్షేత్రస్థాయిలో పార్టీ అనుచరగణం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తోంది. కష్టపడే వారికే పదవులు దక్కుతాయంటూ నిత్యం అధిష్టానం మాటలు చెబుతుంది. కానీ ఆచరణలో మాత్రం ఆ మాటల్ని పక్కన పెడుతుందని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

మళ్లీ అదే సామాజిక వర్గం చేతుల్లోకి..

వాస్తవానికి ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించాల్సి ఉంది. అయితే సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల సంగతి పక్కనపెడితే.. నల్లగొండ జిల్లా అధ్యక్ష పీఠం పార్టీలో అసంతృప్తులకు దారితీస్తోంది. వాస్తవానికి పార్టీ ఆవిర్భావం తర్వాత నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే విజయ సింహారెడ్డి, అనంతరం కొంతకాలం పాటు ఆలేరు మాజీ ఎమ్మెల్యే కె.నగేశ్ పనిచేశారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాతి నుంచి ఇటీవల కాలం వరకు సుదీర్ఘ కాలం పాటు బండా నరేందర్ రెడ్డి అధ్యక్షులుగా పనిచేశారు. జిల్లాలో టీఆర్ఎస్ అధ్యక్షులుగా ఎక్కువ కాలం పనిచేసింది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. అందులో భాగంగానే ఈసారి ఇతర సామాజిక వర్గానికే నల్లగొండ జిల్లా అధ్యక్ష పీఠం కట్టబెట్టాల్సిందేననే వాదన క్షేత్రస్థాయి కార్యకర్తల్లో బలంగా విన్పిస్తోంది.

ప్రధానంగా వీరి పేర్లే..

వాస్తవానికి నల్లగొండ జిల్లాలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిలో చాడ కిషన్ రెడ్డి ఒకరు. అయితే ఈయనకు పార్టీ ఆవిర్భావం నుంచి తగిన ఏ పదవి దక్కింది లేదు. ఈ నేపథ్యంలో ఆయన ఈసారి జిల్లా అధ్యక్ష పీఠం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలోనే పార్టీ జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన మిర్యాలగూడెం మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, గతంలో డీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన సుంకరి మల్లేశ్ గౌడ్‌ సైతం టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. వీరే కాకుండా బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన నేతలు సైతం బలంగానే ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశానికి సైతం పార్టీ అధ్యక్ష పీఠం కట్టబెట్టినా మంచి ఫలితాలను అధిష్టానం రాబట్టుకోవొచ్చు. మరి ఇంతకీ పార్టీ అధిష్టానం రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెడుతుందా..? లేదా ఇతర సామాజిక వర్గాల వైపు మొగ్గు చూపుతుందా..? అన్నది వేచిచూడాల్సిందే.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..