ఛార్జీల పట్టిక ప్రదర్శించాలి

by  |
ఛార్జీల పట్టిక ప్రదర్శించాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రులు పేషెంట్ల నుంచి అధిక మొత్తంలో ఛార్జీలను వసూలు చేస్తున్నట్లు భారీ స్థాయిలో ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ప్రతీ కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య సేవలకు అయ్యే ఖర్చును ఛార్జీల పట్టిక రూపంలో పేషెంట్లకు ప్రస్ఫుటంగా కనబడేలా ప్రదర్శించాలని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. అన్ని ఆసుపత్రులకూ సర్క్యులర్ పంపించారు. గతేడాది డిసెంబరు 31వ తేదీ నాటికి ఏయే వైద్య సేవలకు ఎంత మొత్తంలో ఛార్జీలు ఉండేవో వాటినే ఇప్పుడు కూడా వసూలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పీపీఈ కిట్లు, మందులు తదితరాలకు తప్పనిసరిగా గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేశారు. కరోనా చికిత్సకు ప్రభుత్వం నిర్ణయించిన మేరకు మాత్రమే ఛార్జీలను వసూలు చేయాలని, అధికంగా వసూలుచేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పేషెంట్లు చికిత్స పొందిన అనంతరం వారికి డిశ్చార్జి సమ్మరీతో పాటు బిల్లు కూడా పూర్తి వివరాలతో ఉండాలని, ఐటెమ్‌ల వారీగా ఏ వైద్య సేవకు ఎంత ఛార్జీ వసూలు చేసిందీ పేర్కొనాలని స్పష్టం చేశారు. చాలా సందర్భాల్లో పేషెంట్లకు ఐటెమ్‌ల వారీగా ఛార్జీలను పేర్కొనడంలేదనే ఫిర్యాదులు వచ్చాయని, వాస్తవానికి వసూలుచేస్తున్న డబ్బులకు, ఇస్తున్న బిల్లులకు మధ్య పొంతన ఉండడంలేదన్నది ఆ ఫిర్యాదుల్లో చాలా మంది పేర్కొంటున్నారని డైరెక్టర్ ఆ సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రులు పారదర్శకంగా వ్యవహరించడానికి ఛార్జీల పట్టికను ప్రదర్శించడం, ఐటెమ్‌ల వారీగా బిల్లుల్ని ఇవ్వడం చాలా అవసరమని, పేషెంట్లకు ఏ చికిత్సకు ఎంత ఖర్చయిందో, ఆసుపత్రుల యాజమాన్యాలు ఎంత వసూలు చేశాయో స్పష్టంగా తెలుస్తుందని, విధిగా అన్ని ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రులు ఈ విధానాన్ని పాటించాలని ఆ సర్క్యులర్‌లో స్పష్టం చేశారు.



Next Story

Most Viewed