కన్సార్టియం ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వం సంతకం

by  |
KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో : పరిశోధన, అభివృద్ధి మొదలుకుని ఉత్పత్తిలో ఆధునిక పద్దతుల అవలంబించడం తో పాటు కాలుష్య​రహిత, సుస్థిర విధానాల వైపు దేశీయ ఔషధ తయారీ రంగం మళ్లేందుకు ‘ఫ్లో కెమిస్ట్రీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ పేరిట ఏర్పాటయ్యే టెక్నాలజీ హబ్‌ దోహపడుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

ఈ సీఓఈ ఏర్పాటులో డాక్టర్‌ రెడ్డీస్‌, లారస్‌ ల్యాబ్స్‌ ఎనలేని సహకారం అందించాయని కితాబునిచ్చారు. హైదరాబాద్‌లో ‘ఫ్లో కెమిస్ర్టీ’లో బహుళ ప్రయోజనాలతో కూడిన ఆవిష్కరణలు, సాంకేతిక కేంద్రం ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ (సీఓఈ)ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఓఈ స్థాపన కోసం కన్సార్టియం ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ ఒప్పందంపై డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఎండీ జీవీ ప్రసాద్‌, లారస్‌ ల్యాబ్స్‌ సీఈఓ డాక్టర్‌ సత్యనారాయణ చావా, లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తి నాగప్పన్‌, డాక్టర్ రెడ్డీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్‌ శ్రీనివాస్‌ ఓరుగంటి సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుతో ఔషధ రంగ పరిశోధన, అభివృద్దిలో ఫ్లో కెమిస్ట్రీ సాంకేతికతను చొప్పించడం ద్వారా ఔషధాల తయారీలో కీలకమైన ఆక్టివ్‌ ఫార్మా ఇంగ్రిడియెంట్స్‌ను (ముడి రసాయనాలు) నిరంతరం తయారు చేసే అవకాశం ఏర్పడుతుందన్నారు. సీఓఈ లో జరిగే పరిశోధనలకు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన శాస్త్రవేత్తలు మార్గనిర్దేశం చేస్తారని, ఫ్లో కెమిస్ట్రీలో నైపుణ్యం, నిరంతరం ఉత్పత్తి ద్వారా లబ్ధి పొందేందుకు ఈ కన్సార్టియంలో మరిన్ని పరిశ్రమలు చేరి లబ్దిపొందేలా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందజేస్తుందని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ లైఫ్‌సైన్సెస్‌ తయారీ రంగంలో తెలంగాణకు ఉన్న ప్రాధాన్యతను కాపాడుకుంటూనే మరింత అభివృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. లైఫ్‌ సైన్సెస్‌ విభాగం డైరక్టర్‌ శక్తి నాగప్పన్‌ మాట్లాడుతూ లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ఫ్లో కెమిస్ట్రీ సీఓఈ ఏర్పాటు మైలురాయి వంటిదని, రాష్ట్రంలో ఈ రంగాన్ని 2030 నాటికి వంద బిలియన్‌ డాలర్ల పరిశ్రమగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ఫార్మా రంగంలో ముడి రసాయనాలుగా పేర్కొనే ఏపీఐ, ఇంటర్మీడియేట్స్‌ తయారీ పరిశ్రమకు సీఓఈ ఏర్పాటుతో ఊతం లభిస్తుందన్నారు. భారత్ లైఫ్ సైన్సెస్ రాజధానిగా, ఆసియా పసిఫిక్‌లో ముఖ్యమైన లైఫ్ సైన్సెస్ హబ్‌గా హైదరాబాద్ పరిగణించబడనుంది. 800 కి పైగా ఫార్మాస్యూటికల్ కంపెనీలతో, నగరం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో యూఎస్ఎఫ్ డీఏ ఆమోదించిన సౌకర్యాలను కలిగి ఉందని, దేశం మొత్తం ఔషధ ఉత్పత్తి లో 35 శాతం హైదరాబాద్ నుంచి సరఫరా చేయనుంది పేర్కొన్నారు.



Next Story

Most Viewed