ఉద్యమాన్ని విరమించిన రైతు సంఘాలు.. కేంద్రం లేఖ

by  |
protesting farmers in Delhi
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రం తీసుకొచ్చిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏడాదికి పైగా ఢిల్లీలోనే మకాం వేసి పోరాటం చేసిన రైతులు తమ ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లను తొలగిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ చేసిన ఉద్యమానికి కేంద్రం వెనక్కి తగ్గి ఆ మూడు చట్టాలను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. అయితే, చట్టాలను విరమించినా.. ఉద్యమాన్ని ఆపని రైతులు.. పండించిన పంటకు మద్దతు ధర లభించేలా చట్టాన్ని తీసుకురావాలన్న డిమాండ్‌తో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు.

ఈ క్రమంలోనే కేంద్రం రైతులకు ఓ లేఖ రాసింది. అందులో MSPపై ఒక కమిటీని ఏర్పాటు చేసి, రైతులపై ఉన్న కేసులను వెంటనే ఉపసంహరించుకుంటామని వాగ్దానం చేస్తున్నట్లు ఉంది. అంతేగాకుండా చనిపోయిన రైతుల కుటుంబాలకు అందించే పరిహారం గురించి కూడా కేంద్రం రాసిన లేఖలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఉద్యమాన్ని విరమించి రైతులు ఇళ్లకు వెళ్లడంపై సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ హామీలపై జనవరి 15న తిరిగి సమీక్షించనుంది.

Next Story