ఒక కోటి డేటా సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం

by  |
ఒక కోటి డేటా సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పబ్లిక్ వైఫై సేవలు అందించడానికి కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనికోసం పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లను ఏర్పాటుచేయడానికి సిద్ధమైంది. భారీగా వైఫై సేవలు అందుబాటులోకి తేవాలన్న నిర్ణయంలో భాగంగా పీఎం-వైఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్‌ఫేస్(పీఎం-వాణి)ను ప్రవేశపెట్టడానికి ప్రధాని మోడీ సారథ్యంలో బుధవారం భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఒక కోటి డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఆమోదించింది.

పబ్లిక్ డేటా ఆఫీసుల ద్వారా పబ్లిక్ డేటా ఆఫీసు అగ్రిగేటర్స్(పీడీఓఏ)లు ఈ సేవలు అందిస్తాయి. ప్రభుత్వ అధీనంలోని వైఫై కేంద్రాల ద్వారా దేశవ్యాప్తంగా సేవలు అందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే ఈ పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌ల ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించడానికి లైసెన్సు ఫీజులు ఉండవని, రిజిస్ట్రేషన్లూ ఉచితంగా ఉంటాయని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఈ కేంద్రాలను ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చునని, ఒక దుకాణం, ఒక టీ కొట్టు, ఇంకెవరైనా సులువుగా వైఫై నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసి సేవలు అందించవచ్చునని వివరించారు. లక్షదీవుల్లోని 11 దీవులకు ఇదే నెట్‌వర్క్‌ను పొడిగించడానికి సముద్రంలోపల నుంచి ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లను వేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.

అలాగే, ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన కోసం నిధుల కేటాయింపుపైనా మంత్రివర్గం ఒక నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 1,584 కోట్ల నిధులను ఖర్చుపెట్టడానికి ఆమోదం తెలిపింది. 2020 నుంచి 2023 వరకు అమల్లో ఉండనున్న ఈ పథకం కోసం మొత్తంగా 22810 కోట్ల నిధులను కేటాయించడానికి నిర్ణయించింది. వ్యాపారాలకు దన్నుగా నిలిచి ఉద్యోగ నియమకాలు జరిగేలా ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పథకాన్ని కేంద్రం రూపొందించింది. ఈ పథకంతో 58.5 లక్షల ఉద్యోగులు లబ్ది పొందనున్నారు.

Next Story

Most Viewed