జూన్ 8 నుంచి టెన్త్ పరీక్షలు ?

by  |
జూన్ 8 నుంచి టెన్త్ పరీక్షలు ?
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కారణంగా రాష్ట్రంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన పదవ తరగతి పరీక్షలను తిరిగి నిర్వహించడానికి హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. జూన్ 8వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించుకోవచ్చని సూచించింది. పరీక్షలను జరపడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ తెలియజేయడంతో హైకోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది. జూన్ 3వ తేదీ నాటికి రాష్ట్రంలో కరోనా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో సమీక్షించాలని సూచించింది. ఆ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం పరీక్షలను ఏ విధంగా నిర్వహించాలనుకుంటుందో జూన్ 4వ తేదీన రాష్ట్ర హైకోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ప్రతీ పరీక్షకు రెండు రోజుల చొప్పున వ్యవధి ఉండాలని స్పష్టం చేసింది. పరీక్షలు రాయనున్న విద్యార్థులకు సందేహాలను నివృత్తి చేయడానికి ఒక హెల్ప్ లైన్ నెంబర్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. వీటికి సానుకూలంగా స్పందించిన అడ్వొకేట్ జనరల్ తప్పకుండా కోర్టు సూచించిన అన్ని చర్యలనూ చేపడతామని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల దగ్గర కూడా పటిష్ట చర్యలు తీసుకుంటామని, కరోనా వ్యాప్తి నివారణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని కోర్టుకు స్పష్టం చేశారు. జూన్ 8 నుంచి పరీక్షలు నిర్వహించుకోడానికి హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన దృష్ట్యా ఇక తేదీలను ఖరారు చేయడంతో పాటు టైమ్ టేబుల్‌ను తయారుచేయడం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. ఇప్పటికే సీబీఎస్ఈ, తమిళనాడు ఎస్ఎస్ఎల్‌సీ పరీక్షల టైమ్ టేబుళ్ళు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సిద్ధమైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నిర్దిష్టంగా ఎప్పటి నుంచి పరీక్షలను నిర్వహించనుందనేది త్వరలోనే వెల్లడికానుంది.



Next Story

Most Viewed