వచ్చే వారం నుంచి టెన్త్‌ ప్రత్యక్ష తరగతులు?

by  |
వచ్చే వారం నుంచి టెన్త్‌ ప్రత్యక్ష తరగతులు?
X

దిశ, హలియా: టెన్త్‌ విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులను వచ్చే వారం నుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఫిబ్రవరి-1 నుంచి ప్రారంభమైన తరగతులు మార్చి 23 వరకు కొనసాగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి, మార్చి నెలల్లో 44 పనిదినాల్లో మాత్రమే ప్రత్యక్ష తరగతులు సాగాయి. వార్షిక పరీక్షలు మే 17 నుంచి 26 వరకు జరగాల్సి ఉంది. దీనికి మరో 35 రోజులు మాత్రమే గడువు ఉండడంతో కనీసం పదో తరగతి విద్యార్థులకు సాధ్యమైనన్ని ఎక్కువ ప్రత్యక్ష తరగతులు జరిగేలా చూడాలని విద్యాశాఖ భావిస్తోంది. వచ్చే వారం 8 నుంచి ప్రారంభిస్తే మరో 28 రోజుల పాటు తరగతులు ఉంటాయని విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలిసింది.

పది పరీక్ష కేంద్రాలు పెంపు

వచ్చే నెలలో జరిగే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఏర్పాట్ల కోసం జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 132 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ఈసారి పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచారు. గతంలో 89 ఉండగా.. ఈసారి 132 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ప్రతి గదికి 20 నుంచి 24మందిని విద్యార్థులను కేటాయించే వారు. ఈసారి కొవిడ్‌ దృష్ట్యా కేవలం 10 నుంచి 12 మందిని మాత్రమే కేటాయిస్తున్నారు. విద్యార్థి, విద్యార్థికి మధ్య ఆరడుగల భౌతికదూరం తప్పక పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు, సంక్షేమ గురుకుల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలో పరీక్ష కేంద్రాలతో పాటు అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను, కొన్ని డిగ్రీ కళాశాలలల్లో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని చోట్ల ప్రహరీ గోడ, గాలి, వెలుతురు, ఫ్యాన్లు, ఫర్నీచర్‌ సౌకర్యం ఉన్న ప్రైవేటు పాఠశాలను కేంద్రాలుగా కేటాయించారు.

పరీక్షలకు సరిపోయినంత మంది ఇన్విజిలేటర్లు

ఇన్విజిలేటర్ల సంఖ్య కూడా పెరగనుంది. విద్యాశాఖ నుంచే అవసరమైన ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జీటీలు అందుబాటులో ఉన్నారు. ఒక కేంద్రంలో ఒక చీఫ్‌ సూపరింటెండెంట్‌తో పాటు డిపార్టుమెంటల్‌ ఆఫీసర్‌, ప్రతి గదికి ఒక ఇన్విజిలేర్‌ చొప్పున కేటాయించారు. మొత్తం 122 పాఠశాలలతో పాటు అదనగా 10 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను సైతం ఎంపిక చేశారు. కొవిడ్‌ నేపథ్యంలో విద్యార్థులు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించి పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో శానిటైజర్లను అందుబాటులో ఉంచుతారు.

జంబ్లింగ్‌ పద్ధతిలో కేంద్రాల కేటాయింపు

పది పరీక్షలకు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం జిల్లా విద్యాశాఖ అధికారులు జంబ్లింగ్‌ పద్ధతిలో కేంద్రాలు కేటాయించారు. జిల్లాలోని 496 పాఠశాలలను 52 జోన్లుగా విభజించారు. పరీక్ష కేంద్రాలను మూడు విభాగాలుగా విభజించారు. మండల కేంద్రాల్లో ఉన్న పాఠశాలలను ‘ఎ’ కేంద్రాలుగా, పోలీసు స్టేషన్‌కు 8కి.మీ. దూరంలో ఉన్న కేంద్రాలను ‘బి’ కేంద్రాలుగా, అంతకంటే దూరంగా ఉన్న కేంద్రాలను ‘సి’ కేంద్రాలుగా విభజించారు.

కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా కేంద్రాలు

జిల్లాలో పది పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నాం. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో ఈసారి పరీక్ష కేంద్రాలను పెంచుతున్నాం. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నాం. విద్యార్థులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రతి కేంద్రం వద్ద కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటాం.

Next Story