రాష్ట్ర సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత.. ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్నా

75

దిశ, కోదాడ: తెలంగాణ రాష్ర్టంలోకి ఏపీ నుండి వచ్చే కరోనా రోగులను అనుమతించే విషయంపై ఇంకా వివాదం నడుస్తూనే ఉంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రాష్ర్ట బార్డర్‌‌ రామాపురం క్రాస్‌‌ రోడ్‌‌లో శుక్రవారం కూడా ఏపీ నుండి వచ్చే అంబులెన్సులను కోదాడ రూరల్‌‌ పోలీసులు నిలిపివేశారు. అనుమతులు లేకుండా అంబులెన్సులను అనుమతించవద్దని తమకు ఉన్నతాధికారుల నుండి ఆదేశాలున్నాయని, అంబులెన్సులలో వచ్చే వారు అన్ని అనుమతి పత్రాలను తీసుకురావాలని రోగుల బంధువులకు సూచించారు. శుక్రవారం ఉదయం నుండి అంబులెన్సులను నిలిపివేస్తున్న పోలీసులు.. సాయంత్రం వరకు 5 అంబులెన్సులను వెనుకకు తిప్పి పంపించారు.

అన్ని అనుమతులు ఉన్న ఒక్క అంబులెన్స్‌‌ను మాత్రమే రాష్ర్టంలోకి అనుమతించారు. దీంతో అంబులెన్సులలో వస్తున్న రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మెడికల్‌‌ ఎమర్జన్సీ ఉండడంతో తాము తమ వారి ప్రాణాలు కాపాడుకునేందుకు అంబులెన్సులలో తీసుకు వస్తుండగా.. పోలీసులు అడ్డుకోవడం ఏమిటని పేషెంట్ల తాలూకా బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ హైకోర్టు చెప్పినా పోలీసులు అనుమతించకపోవడంతో తమ వారి ప్రాణాలు పోయేటట్లు ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

బార్డర్‌‌లో నిరసన తెలిపిన ఏపీ నాయకులు

తెలంగాణ బార్డర్‌‌ లో అంబులెన్సుల నిలిపివేతపై సమాచారం తెలుసుకున్న ఏపీ ప్రభుత్వ విప్‌‌, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను బార్డర్‌‌కు చేరుకుని తన నిరసన తెలిపారు. అంబులెన్సులను వదిలివేయాలని కోర్టు ఆదేశాలున్నా.. వాటిని ఎందుకు నిలిపివేస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు. అదే విధంగా.. మాజీ మంత్రి నెట్టెం రఘరాం కూడా బార్డర్‌‌కు చేరుకుని అంబులెన్సులను అనుమతించాలని ప్రభుత్వానికి విజ్శప్తి చేశారు. అయితే అంబులెన్సులను అనుమతించాలని తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని పోలీసులు తెలిపారు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..