కరోనా కొత్త స్ట్రెయిన్‌పై టెన్షన్

by  |
India corona cases
X

దిశ, తెలంగాణ బ్యూరో: బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో మరో వ్యక్తికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో వైరస్ బారిన పడినవారి సంఖ్య 21కు చేరుకుంది. ఇంకా 156మంది వివరాలను సేకరించాల్సి ఉంది. వైరస్ బారిన పడినవారిలో గరిష్టంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందినవారు తొమ్మిది మంది ఉన్నారు. వీరందరూ ప్రస్తుతం వేర్వేరు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. వీరి శాంపిళ్ళను పరిశీలించిన సీసీఎంబీ రిపోర్టులను కూడా రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు అందజేసింది. అయితే వారికి సోకిన వైరస్ కొత్త స్ట్రెయినా లేక పాతదా అనేదానిపై రాష్ట్ర అధికారులు వెల్లడించడానికి సుముఖంగా లేరు. తమకు అందిన రిపోర్టులను కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖకు పంపామని, వివరాలను అక్కడే అధికారులు వెల్లడిస్తారని, ఇక్కడ బహిర్గతం చేయవద్దన్న ఆదేశం మేరకు వెల్లడించడంలేదని ఓ అధికారి పేర్కొన్నారు.

బ్రిటన్ నుంచి వచ్చిన మొత్తం 1216మందిలో ఇప్పటివరకు 996 మందిని గుర్తించి వైద్య పరీక్షలు చేశామని, ఇందులో ముప్పై మంది మినహా మిగిలినవారందరికీ నెగెటివ్ వచ్చిందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటివరకు 21మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా మరో తొమ్మిది మంది రిపోర్టు రావాల్సి ఉందన్నారు. ఇక 156మంది వివరాలను సేకరించగలిగినా వారిని గుర్తించలేకపోయామని తెలిపారు. బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఆరుగురు తిరిగి విదేశాలకు వెళ్ళిపోయారని, 58 మంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారని వివరించారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే మొత్తం 996 మందిని గుర్తించడంపై వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్ అభినందనలు తెలియజేశారు.

తాజాగా పాజిటివ్ వచ్చిన వ్యక్తి మేడ్చల్ జిల్లాకు చెందినవారని, దీంతో ఆ జిల్లాలో ఇప్పటివరకు బ్రిటన్ నుంచి వచ్చినవారిలో తొమ్మిది మందికి వైరస్ సోకినట్లయిందని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్ నగరానికి చెందినవారు నలుగురు, జగిత్యాల జిల్లాకు చెందినవారు ఇద్దరు, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లా నుంచి ఒక్కొక్కరు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు.



Next Story

Most Viewed