త్రిపురలో ఆందోళనలు ఉద్రిక్తం

by  |
త్రిపురలో ఆందోళనలు ఉద్రిక్తం
X

గువాహటి: మిజోరం నుంచి త్రిపురకు తిరిగి వచ్చిన బ్రూ గిరిజనులకు పునరావసం కల్పించడాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళనకారులు జాతీయ రహదారి దిగ్బంధించడంతోపాటు రాళ్లు విసరడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతిచెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మిజోరం నుంచి వలస వచ్చిన 35,000 మంది బ్రూ గిరిజనులకు త్రిపురలో పునరావసం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16 నుంచి పునరావస కల్పన ప్రారంభమైంది.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో సోమవారం నుంచి ఆందోళనలు మొదలయ్యాయి. దాదాపు 12 నుంచి 15వేల మంది ర్యాలీలు, ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టారు. శనివారం పనిసాగర్ పట్టణం వద్ద జాతీయ రహదారిని ఆందోళనకారులు దిగ్బంధించారు. రాళ్లు విసరడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు కాల్పులు జరిపారు. అక్కడికక్కడే శ్రీకాంత దాస్(45) మృతిచెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు ధ్రువీకరించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులతోపాటు సైన్యాన్ని రంగంలోకి దించినట్టు సమచారం.


Next Story

Most Viewed