పాతబస్తీలో టెన్షన్.. ఎప్పుడైనా అది జరగొచ్చంట

by  |
పాతబస్తీలో టెన్షన్.. ఎప్పుడైనా అది జరగొచ్చంట
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: వరుస వర్షాలతో పురాతన భవనాల్లో నివాసం ఉంటున్న వారు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులు పురాతన భవనాలను గుర్తించి సెక్షన్ 459 ప్రకారం యజమానులకు నోటీసులు సైతం జారీ చేశారు. కొన్ని చోట్ల యజమానులు ప్రమాదాన్ని అంచనా వేసి ముందస్తుగా ఇళ్లను ఖాళీ చేసి మరోచోటుకు వెళ్తుండగా ఏళ్ల తరబడిగా అద్దెకు ఉండే వారు ఖాళీ చేయడానికి ససేమిరా అంటున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేస్తున్నప్పటికీ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటున్నారు.

పాత బస్తీలో అధికం..

పురాతన భవనాలు నగరంలోని పాత బస్తీలో అధికంగా ఉన్నాయి. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, బడీచౌడీ, ముక్తియార్ గంజ్, అఫ్జల్ గంజ్, గౌలిగూడ, చార్మినార్ వంటి ప్రాంతాలు వ్యాపారపరంగా ఎంతో పేరు పొందాయి. ఆయా ప్రాంతాల్లో కొన్ని చోట్ల పాత భవనాల్లోనే వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు. మరికొన్ని చోట్ల నివాసముంటున్నారు. చాలా భవనాల్లో దశాబ్దాల క్రితం అద్దెకు తీసుకొని తక్కువ కిరాయి ఇస్తూ అద్దెకు ఉండే వారు వాటిని ఖాళీ చేయడానికి ముందుకు రావడం లేదు.

యజమాని ముందుకు వచ్చినా..?

శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి వాటికి మహా నగర పాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే చాలా చోట్ల జీహెచ్ఎంసీ గుర్తించిన భవనాల్లో అద్దెకు ఉంటున్న వారు నోటీసులు అందుకున్నప్పటికీ ఖాళీ చేయడం లేదు. ఇంటి, దుకాణ యజమాని ఖాళీ చేయాలని ఒత్తిడి తెచ్చినప్పటికీ ఖాళీ చేయకపోగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. కోర్టులలో కేసులు సంవత్సరాలుగా కొనసాగుతుండడంతో పాత భవనాల కూల్చివేతలు పెండింగ్ పడుతున్నాయి. ఇదిలా ఉండగా కొన్ని భవనాల విషయంలో మాత్రం అధికారులు ముడుపులు తీసుకుని చూసీ చూడనట్లు వదిలేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఒక్క సర్కిల్ 14 లోనే…

మహా నగర పాలక సంస్థ సర్కిల్ 14 (ఆబిడ్స్) పరిధిలోనే అధికారులు 101 పురాతన భవనాలను గుర్తించి నోటీసులు జారీ చేశారు. వీటిల్లో 25 భవనాలు కూల్చి వేయాల్సి ఉండగా కేవలం 10 మాత్రమే కూల్చి వేశారు. రెండు భవనాలు జేఎన్ టీయూ పరిధిలో ఉన్నాయి. మరో 45 చోట్ల ఇంజినీరింగ్ అధికారులు పెండింగ్ లో పెట్టారు. 15 కోర్టు కేసులలో, రెండు హెరిటేజ్ పేరుతో, మరో రెండు చోట్ల పాఠశాలలు ఉండడంతో పెండింగ్ లో పెట్టారు. కేవలం ఒక్క సర్కిల్ లోనే వందకు పైగా శిథిలావస్థకు చేరిన భవనాలు ఉంటే జీహెచ్ఎంసీ పరిధిలో వేల సంఖ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయి. వర్షాలతో వీటిల్లో ఏ ఒక్కటి కూలినా ప్రాణ నష్టం అధికంగా ఉంటుంది.

నగరాన్ని కమ్మేసిన ముసురు

ముసురు నగర జీవులను ఆగమాగం చేస్తున్నది. పొద్దంతా చినుకులు పడుతూనే ఉండడంతో ఇళ్లల్లోంచి ప్రజలు బయటికి రావడం లేదు. చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. లోతైన గుంతలు ఏర్పడి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. గడిచిన వారం రోజుల్లో కేవలం ఈ నెల 18వ తేదీన ఒక్క రోజు మాత్రమే వర్షం కురియలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో గడిచిన 48 గంటలుగా వర్షం విరామం లేకుండా కురుసింది. దీంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రోడ్లపై వర్షం నీరు చేరి వాహనదారులు ఇబ్బందుల పాలయ్యారు. ఇదిలా ఉండగా సాగర్ రింగ్ రోడ్డు నుంచి కర్మన్ ఘాట్ వైపు వచ్చే రోడ్డు పూర్తిగా గుంతలమయమైంది. ఈ దారిలో ద్విచక్ర వాహనాల సంగతి అటుంచితే కార్లు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది. ఇటీవల సాగర్ రింగ్ రోడ్డు వద్ద వంతెనను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆ సందర్భంలో మంత్రిని ఇక్కడి నుంచి తీసుకువస్తే రోడ్డు బాగుపడేదని స్థానికులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఉస్మానియాలో కూలిన శ్లాబ్​పెచ్చులు

ఉస్మానియా ఆస్పత్రి కులీ కుతుబ్ షా భవనం రెండో అంతస్తులోని కార్డియాలజీ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గదిలో ఉన్న మరుగుదొడ్డిలో శ్లాబు పెచ్చులూడి పడ్డాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గురువారం తెల్లవారు జామున పెద్ద శబ్ధంతో పెచ్చులూడి టాయిలెట్ బేసిన్ పై పడడంతో సమీపంలో చికిత్సలు పొందుతున్న రోగులు, సిబ్బంది, వైద్యులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న సూపరింటెండెంట్ నాగేందర్ వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని పరిశీలించారు.

Next Story

Most Viewed