సూపర్ బజార్‌లో ఉద్రిక్తత.. పోలీసులతో బల్మూరి వెంకట్ వాగ్వాదం

by  |
Congress leader Balmuri Venkat
X

దిశ, హుజురాబాద్/హుజురాబాద్ రూరల్: అంబులెన్సులో ఉన్న వంతడుపుల రాజేశ్వరి మృతదేహాన్ని సూపర్ బజార్ నుండి అంబేద్కర్ కూడలికి తరలించి ధర్నా చేయడానికి ప్రయత్నించిన ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి డాక్టర్ బల్మూరి వెంకట్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. రాజేశ్వరి కుటుంబ సభ్యులు, ప్రమాదంలో గాయపడిన బాధితులు పట్టణంలోని సూపర్ బజార్‌లో రెండు గంటలకు పైగా ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేసే వరకు ధర్నా విరమించేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. విషయం తెలుసుకున్న బల్మూరి వెంకట్ కాంగ్రెస్ కార్యకర్తలతో సహా వెళ్లి మృతదేహంతో ఉన్న అంబులెన్సును అంబేద్కర్ కూడలికి తరలిస్తుండగా సీఐ శ్రీనివాస్‌ అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది.

న్యాయం చేయాలని ఆందోళనకు దిగిన బాధితులతో కలిసి వెంకట్ అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన స్వరూప, రాజేశ్వరి కుటుంబాలతో పాటు గాయాలపాలైన వారందరికీ నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీకి చెందిన ఓ ప్రముఖ నాయకుడు ఫోన్‌లో సర్ది చెప్పినప్పటికీ బాధితులు ఆందోళన విరమించలేదు. సహాయం చేసే విషయంలో స్పష్టమైన హామీ ఇస్తేనే విరమిస్తామని బైటాయించారు.



Next Story

Most Viewed