AP News: 'పేరుకే మంత్రులు.. పెత్తనమంతా ఆయనదే'.. క్యాబినెట్‌పై యనమల సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
AP News: పేరుకే మంత్రులు.. పెత్తనమంతా ఆయనదే.. క్యాబినెట్‌పై యనమల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డెమోక్రటిక్ డిక్టేటర్.ప్రజాస్వామ్యంలో గెలిచి, అదే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నియంత‌ృత్వ పాలన చేస్తున్నాడు. బీసీలకు మంత్రి పదవులు ఇవ్వడం కాన్ స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్‌లో భాగమే. మంత్రివర్గంలో ఉన్న బీసీలకు పరిపాలనలో ఎలాంటి భాగస్వామ్యం లేదు. కేవలం కేబినెట్లోనే వారు భాగస్వాములు అని మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. 'మంత్రివర్గ నిర్ణయాలు, మంత్రులుగా ఎవరుండాలనే విషయాల్లో సజ్జల అంతాతానై వ్యవహరిస్తున్నాడు.

ముఖ్యమంత్రి బంధువన్న ఒకే ఒక్క అర్హత తప్ప, ప్రభుత్వంలో, కేబినెట్ నిర్ణయాల్లో జోక్యం చేసుకునే అధికారం సజ్జల రామకృష్ణారెడ్డికి ఉందా ? గత కేబినెట్ పప్పెట్ కేబినెట్ అయితే ఇప్పుడు కొలువుదీరిన మంత్రివర్గం ఛాయ్ బిస్కెట్ కేబినెట్. బీసీలపై జగన్మోహన్ రెడ్డికి అంత ప్రేమేఉంటే, ప్రభుత్వ సలహాదారుల నియామకాల్లో, ఇతరత్రా ముఖ్యమైన పదవుల్లో వారికి ఎందుకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు? తనపై, తనప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని జగన్‌కు అర్థమైంది. అందుకే పాత మంత్రివర్గంలోఉన్నవారే 11మంది తిరిగి చోటు దక్కించుకున్నారు. నిధులు, విధులు, కూర్చోవడానికి కుర్చీలులేని బీసీ కార్పొరేషన్లతో బడుగులకు ఏం ఒరుగుతుంది?' అని పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.

పేరుకే బీసీ మంత్రులు పెత్తనమంతా సజ్జలదే..

రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కేబినెట్‌పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొత్త కేబినెట్ అంతా ఛాయ్ బిస్కెట్ కేబినెట్ అని విమర్శించారు. గత కేబినెట్ పప్పెట్ అయితే ఇది ఛాయ్ బిస్కెట్ కేబినెట్ అంటూ మండిపడ్డారు. బీసీలకు మంత్రివర్గంలో అధికప్రాతినిధ్యం కల్పించామని ప్రచారం చేసుకుంటున్న సీఎం జగన్, ప్రభుత్వం.. ఎంతమంది బీసీ మంత్రులకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం కల్పించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పేరుకే వారు మంత్రులని.. ఎలాంటి అధికారాలు ఉండవు. కనీసం వారి వారి శాఖలకు సంబంధించి స్వతంత్ర్యంగా వ్యవహరించే అవకాశం అసలే లేదు. మంత్రులు ఏం చేయాలో, వారిశాఖలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో నిర్ణయించేది ముఖ్యమంత్రే. పొలిటికల్ ఆబ్లిగేషన్ ప్రకారం ముఖ్యమంత్రి తనకేబినెట్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వలేదు.

కేవలం కాన్‌స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ప్రకారం కేబినెట్‌లో బీసీలు ఉండాలి కాబట్టి వారికి మంత్రిపదవులు ఇచ్చాడు. మంత్రులు ఎవరికీ స్వతంత్రంగా వ్యవహరించే ధైర్యంలేదు. మంత్రులకు వాయిస్ లేకపోవడానికి ముఖ్యమంత్రే కారణం. ముఖ్యమంత్రి డెమోక్రటిక్ డిక్టేటర్. ప్రజాస్వామ్యంలో గెలిచాడు. డెమోక్రటిక్ సిస్టమ్‌తోనే నియంత‌ృత్వ పాలన చేస్తున్నాడు. ముఖ్యమంత్రిని అందుకే తుగ్లక్, హిట్లర్‌‌తో పోల్చాము. అలాంటి నియంతల భావాలే ఈ ముఖ్యమంత్రిలో ఉన్నాయి. కేబినెట్ మార్చినంత మాత్రాన అధికారంలోకి వస్తామని అనుకోవడం అన్ వాంటెడ్ ఇమాజినేషన్. జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం అధికారంలోకి రావడమనేది ఇంపాజిబుల్. ఊహాగానాలతో ప్రజలను మాయలోముంచి, వారికిచ్చిన వాగ్దానాలు ఒక్కటీ నెరవేర్చని ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇతర శాఖలపై జోక్యం చేసుకోరు. ఎలాంటి చిన్న విషయమైనా సరే, పార్టీపరంగా అయినా, ప్రభుత్వపరంగా అయినా అందరితో సంప్రదించాకే అంతిమ నిర్ణయానికి వస్తారు. జగన్‌లా నియంతలా వ్యవహరించరు అని యనమల ఎద్దేవా చేశారు.

సజ్జల వల్ల వైసీపీకి ముప్పే..

మరోవైపు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై యనమల రామకృష్ణుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నామ్ కే వాస్తే వారు బీసీమంత్రులని పెత్తనమంతా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిదేనని యనమల సంచలన ఆరోపణలు చేశారు. అసలు ఎవరీ సజ్జల? అని ప్రశ్నించారు. సజ్జలకు ఏం అధికారం ఉందని మంత్రుల నిర్ణయాలు, వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాడని నిలదీశారు. సజ్జలకు ఉన్నది కాన్ స్టిట్యూషనల్ పవరా? ఆయనెప్పుడూ ఎక్స్ ట్రా కాన్ స్టిట్యూషనల్ అథారిటీనే. కేవలం జగన్ బంధువు అన్నఒకే ఒక్కకారణంతో మంత్రివర్గం ఏంచేయాలో, ఎలా ప్రవర్తించాలో నిర్ణయిస్తాడా? సజ్జల వల్ల వైసీపీకీ ముప్పే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చారు.

బీసీలకు కేటాయించే రూ.36వేల కోట్లు ఎక్కడ?

'ప్రజల్లో ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై వ్యతిరేకత ఉండటంతో, సీనియర్లను తొలగిస్తే, వారంతా తిరగబడతారని ముఖ్యమంత్రికి అర్థమైంది. కొందరు తిరగబడటానికి ప్రయత్నిస్తారని గ్రహించే పాతవాళ్లలో చాలామందిని తిరిగి కేబినెట్‌లో కొనసాగించాడు. ప్రజావ్యతిరేకత ప్రభుత్వంపై ఎక్కువైనప్పుడు సాధారణంగా రాజకీయ నేతలంతా తిరగ బడతారు. ప్రజల్లో తనపై, తనప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు భయపడే ముఖ్యమంత్రి ప్రజా వ్యతిరేకతకు తలొంచాడు. ఆక్రమంలోనే సీనియర్లని చెప్పుకుంటున్న వారిని తొలగించే ధైర్యం చేయలేకపోయాడు. విధులు, నిధులు, ఆఖరికి కూర్చోవడానికి కుర్చీలు లేని బీసీ కార్పొరేషన్లలో బడుగు, బలహీనవర్గాలకు ఏం ఒరుగుతుంది? బీసీలకు ఇవ్వాల్సిన స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ కింద ఏటా రూ.12వేలకోట్ల వరకు కేటాయించేవాళ్లం. మూడేళ్లలో రూ.36వేలకోట్లు కేటాయించాలి.

కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆనిధులన్నీ ఏం చేసిందో తెలియదు. బీసీలకు రాజకీయంగా స్థానికసంస్థల్లో దక్కాల్సిన 16,800లకు పైగా పదవులు, రిజర్వేషన్లలో కోతపెట్టి, వారికి కాకుండా చేశారు. రాజకీయంగా, ఆర్థికంగా బీసీలను అన్నివిధాలా అణగదొక్కుతూ, వారిని తామే ఉద్దరిస్తున్నామని, ఆ పదవులు.. ఈ పదవులిచ్చామని చెప్పుకుంటున్నారు. ఈమూడేళ్లలో రాష్ట్రంలో పేదరికం బాగా పెరిగింది. అదికూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల్లోనే పెరిగింది. ఆయావర్గాల్లో పేదరికం పెరిగినప్పుడు, వారు ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం ఏం చేసింది?' అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. 'రాజకీయాల్లో పవర్ , మనీ చాలాముఖ్యమైనవి. ఆ రెండూ తనచేతిలోనే పెట్టుకున్న ముఖ్యమంత్రి, బీసీలకు ఏదో పంచిపెట్టినట్లు ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నాడు' అని యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.


Next Story

Most Viewed