సీఏ, ఏపీఎంను రూమ్‌లో బంధించిన డ్వాక్రా మహిళలు.. విచారణ సరిగా లేదని..

by Dishafeatures2 |
సీఏ, ఏపీఎంను రూమ్‌లో బంధించిన డ్వాక్రా మహిళలు.. విచారణ సరిగా లేదని..
X

దిశ, ఖానాపూర్: డ్వాక్రాలో సి.ఏ ల అక్రమాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇటీవల దోపిడీ దళారులు పేరుతో డ్వాక్రాలో జరుగుతున్న అవినీతిపై వార్తలు వచ్చాయి. కొత్తూర్ గ్రామంలోని ఓ సి.ఏ అవినీతి గుర్తించిన నేపథ్యంలో ఆమెను తాత్కాలింగా సస్పెండ్ చేశారు. విచారణలో భాగంగా శనివారం ఆడిట్ నిమిత్తం కొత్తూర్ గ్రామానికి జిల్లా సమాఖ్య ఆడిటర్లు శివ, ప్రసాద్‌తో పాటు ఏపీఎం సుధాకర్ వెళ్లారు. విచారణ జరుగుతున్న క్రమంలో విచారణ అధికారి ఏపీఎం ఏకపక్షంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి అనుకూలంగా వ్యవహరించినట్లు మహిళలు ఆరోపిస్తున్నారు. కొత్తూర్ గ్రామములో సి.ఏ అవినీతి వివరాలు వెల్లడించాలని కోరగా ఏపీఎం దాటవేత ధోరణిని ప్రదర్శించడంతో మహిళలు ఆగ్రహించారు. అనంతరం రూం బయట తలుపులు వేసి వారిని బంధించారు. ఈ క్రమంలో ఏపీఎం ,సి.ఏ అవినీతికి సహకరించిన బ్యాంకు మేనేజర్ని సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు కొత్తూర్ గ్రామానికి చేరుకున్నారు. రూంలో బంధించబడిన వారిని బయటకు తీసుకువచ్చారు. అక్కడ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

ఏమి జరిగిందంటే:

కొత్తూర్ గ్రామంలో మల్లీశ్వరి, ఇందిరా అనే రెండు వివోల పరిధిలో 42 డ్వాక్రా సంఘాలున్నాయి. అయితే అవినీతి ఆరోపణల్లో భాగంగా శనివారం 12 సంఘాల పుస్తకాలని ఆడిట్ చేయగా 9 లక్షల 79 వేల రూపాయల మేరకు అవినీతి, నిధుల దుర్వినియోగాన్ని గుర్తించారు. దీనితో పాటు సభ్యుల చేత లోన్ అయిపోయాక కూడా 11 నెలలు అదనంగా డబ్బులు కట్టించినట్లు గుర్తించారు. సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి లోన్‌లు పొందినట్లుగా తేలినట్లు సమాచారం. ఈ విషయాన్ని బయటకు రాకుండా ఏపీఎం అడ్డుపడుతున్నాడని డ్వాక్రా మహిళా సభ్యులు ఆరోపించారు. కేవలం 12 సంఘాల సామాజిక తనిఖీలో ఇంత పెద్ద మొత్తం బయటపడితే మొత్తం 42 సంఘాల ఆడిట్ పూర్తయితే ఎంత అవినీతి లెక్క బయటపడుతుంది అని స్థానికులు చర్చిస్తున్నారు.

బ్యాంకు అధికారుల ప్రమేయముందా..?

సంతకాల ఫోర్జరీ నుండి మొదలుకొని బ్యాంక్ పుస్తకాల వివరాలు గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. సి.ఏ లు, ఏపీఎం, బ్యాంకు అధికారులు కుమ్మక్కై ఈ దందా చేస్తున్నారని స్థానికులు, మహిళలు ఆరోపిస్తున్నారు. బ్యాంక్‌లో కూడా తనిఖీ చేయాలని, మేనేజర్ని సస్పెండ్ చేయాలని వారు నినాదాలు చేశారు. మహిళా సంఘం ప్రతినిధులు బ్యాంకుకు వెళ్లి వివరాలు అడిగితే ఇవ్వకుండా వెనక్కి పంపిస్తున్నారన్నారు. ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానం చెబుతున్నారన్నారు.

మండల వ్యాప్తంగా ఇలానే ఉందా..

కొత్తూరులో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అన్ని గ్రామాల్లోనూ ఇదే విధమైన దందా కొనసాగుతున్నదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని ఓ రెండు మేజర్ గ్రామ పంచాయతీల్లో ఈ వ్యవహారం నడుస్తున్నదని, ఇప్పటికే మేనేజ్ చేసే ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. మండలంలోని అన్ని సంఘాలను తనిఖీ చేయిస్తే, అమాయకులు, నిరక్షరాస్యుల దగ్గర వీరు చేసిన దోపిడీ బయటపడే అవకాశం ఉంది. అయితే ముందుగా సదరు కీలక అధికారిని బాధ్యతల నుండి తప్పిస్తే అన్నీ బయటకు వస్తాయని డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. విచారణలో 9 లక్షల 79 వేల 435 రూపాయలు అవినీతి సొమ్మును చెల్లించుటానికి సి.ఏ విజిత నుండి అధికారులు అంగీకార ఒప్పంద పత్రాన్ని తీసుకున్నారు. ఇంకా తనిఖీ చేయాల్సిన గ్రూప్‌లు ఉన్న నేపథ్యంలో సమగ్ర విచారణ అనంతరం పూర్తి స్థాయి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.


Next Story

Most Viewed