- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ పోలీసులపై యువతి తీవ్ర ఆరోపణలు!
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పోలీసులపై ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో అర్థరాత్రి ఒంటరిగా చిక్కుకుపోయిన ఓ యువతికి సహాయం చేయకపోగా, పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారంటూ సోషల్ మీడియా వేదికగా వచ్చిన ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారాయి. బాధితురాలు షేర్ చేసిన వీడియో ప్రకారం.. ఆమె విజయవాడ నుండి హైదరాబాద్ వస్తున్న రైలు తీవ్రంగా ఆలస్యం కావడంతో, అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1.45 గంటల సమయంలో లింగపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఆ సమయంలో అంతా చీకటిగా ఉండటం, పైగా ఒంటరిగా ప్రయాణిస్తుండటంతో భయపడి రక్షణ కోసం ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించింది. అయితే, కష్ట కాలంలో ఆదుకోవాల్సిన పోలీసుల నుండి ఆమెకు తీవ్ర నిరాశే ఎదురైంది.
సహాయం కోసం ఫోన్ చేసిన ఆ యువతి పట్ల కొందరు పోలీసులు అత్యంత నిర్లక్ష్యంగా ప్రవర్తించారని సదరు యువతి ఆవేదన వ్యక్తం చేసింది. "నిన్ను ఇంటి దగ్గర దింపాలని మాకు ఏమైనా రూల్ ఉందా? అంతరాత్రి వేళ ప్రయాణాలు చేసేటప్పుడు ముందు జాగ్రత్తగా ఉండాలని నీకు తెలియదా?" అంటూ పోలీసులు ఎదురు ప్రశ్నించి ఫోన్ పెట్టేశారని ఆవేదన వ్యక్తం చేసింది. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పే నగర పోలీసుల నుంచే ఇలాంటి చేదు అనుభవం ఎదురవడంతో ఆమె ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్లో బయట పెట్టింది.
ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్ల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అర్ధరాత్రి వేళల్లో మహిళల రక్షణ కోసం 'షీ టీమ్స్', పెట్రోలింగ్ వాహనాలు అందుబాటులో ఉంటాయని చెప్పే వ్యవస్థలో ఇలా జరగడంపై పలువురు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారం కాస్తా ముదరడంతో పోలీసు ఉన్నతాధికారులు దీనిపై తక్షణమే స్పందించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్లు సమాచారం అందుతోంది. బాధితురాలి ఆరోపణల్లో ఎంతవరకు నిజముంది? ఆ సమయంలో ఫోన్ కాల్ అటెండ్ చేసిన సిబ్బంది ఎవరు? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే, ఈ ఆరోపణలపై పూర్తి స్పష్టత రావాలంటే పోలీసు ఉన్నతాధికారుల అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.






