విజ్ఞాన్ వెనుక ఉన్నది ఎవరు.. డబ్బు పలుకుబడి ఉంటే నిబంధనలు పట్టవా..?

by Dishafeatures2 |
విజ్ఞాన్ వెనుక ఉన్నది ఎవరు.. డబ్బు పలుకుబడి ఉంటే నిబంధనలు పట్టవా..?
X

దిశ, అమీన్ పూర్: ప్రభుత్వ నిబంధనలు గాలికి వదిలేసి ఎటువంటి అనుమతులు లేకుండా భవనాన్ని నిర్మించింది విజ్ఞాన్ విద్యా సంస్థ. కన్జర్వేటివ్ జోన్‌లో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదని స్పష్టమైన నిబంధనలు ఉండడంతో పంచాయతీ నుండి అనుమతి నిరాకరించారు. దాంతో నిబంధనలను విస్మరించి భవనాన్ని నిర్మించారు. పంచాయతీ అనుమతులు లేకుంటే మాకేమనుకున్నారు. డబ్బు, రాజకీయ పలుకుబడి ఉంటే ఏదైనా సాధ్యం అన్న రీతిలో తప్పుడు భవన నిర్మాణ అనుమతి పత్రాలను సృష్టించి విద్యాశాఖను తప్పుదోవ పట్టించి పాఠశాల అనుమతి పొందారు. పంచాయతీ పాలకమండలి ఫిర్యాదు, మీడియాలో వరుస కథనాలతో రంగంలోకి దిగిన అధికారులు విచారణ జరిపి సదరు పాఠశాల దొడ్డిదారిలో తప్పుడు పత్రాలతో అనుమతులు పొందిందని నిర్ధారించారు.

ఆ మేరకు విజ్ఞాన్ విద్యాలయం నిబంధనలను విస్మరించడంపై జిల్లాస్థాయి అధికారులకు సమగ్ర నివేదికను సమర్పించారు. గత సంవత్సరం డిసెంబర్‌లో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ విజ్ఞాన్ విద్యాలయం అనుమతులను రద్దు చేయమని జిల్లా విద్యాధికారికి లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇచ్చారు. అయితే జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ పాఠశాల యధావిధిగా కొనసాగడం స్థానికంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. విజ్ఞాన్ పాఠశాల యాజమాన్యానికి ఆర్థిక బలంతో పాటు పేరున్న బడా నాయకుల అండదండలు పుష్కలంగా ఉండటంతో నిబంధనలు గాలికి వదిలేసినా పాఠశాలపై చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనుకంజ వేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సామాన్యుడు తప్పు చేస్తే వంద రకాల నిబంధనలు చెబుతూ అనేక రకాల ఇబ్బందులకు గురి చేసే అధికార యంత్రాంగం.. నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి విద్యాశాఖని తప్పుదోవ పట్టించిన సదరు పాఠశాలపై చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏంటని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తు గ్రామపంచాయతీ పాలకమండలి ఉమ్మడిగా తీర్మానం చేసి పాఠశాలకు నోటీసులు అందజేసినా, మండల సర్వసభ్య సమావేశంలో ఈ విషయంపై చర్చ జరిపినా అవేమీ పట్టనట్టు అధికారులు ఉదాసీనత వైఖరి ప్రదర్శించడంపై స్థానిక ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీ పాలకమండలి జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారి, జిల్లా పంచాయతీ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎటువంటి ప్రయోజనం లేదని వాపోతున్నారు.

డబ్బు పలుకుబడి రాజకీయ అండదండలు ఉంటే నిబంధనలతో అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నారు. సామాన్యులకు ఒక న్యాయం, బడా బాబులకు మరో న్యాయం అన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారని, అధికార వ్యవస్థనే కాలదన్నే రీతిలో విజ్ఞాన విద్యా సంస్థ వ్యవహరిస్తోందని, అయినా తమకేమీ పట్టనట్టు ఉన్నతాధికారులు వ్యవహరించడం సరికాదని హితవు పలుకుతున్నారు. విజ్ఞాన్ విద్యా సంస్థపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడానికి సిద్ధమవుతామని స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు.



Next Story