ఐటీ నిబంధనలపై ట్విటర్‌కు కేంద్రం ఆఖరి నోటీసులు!

by Dishanational1 |
ఐటీ నిబంధనలపై ట్విటర్‌కు కేంద్రం ఆఖరి నోటీసులు!
X

న్యూఢిల్లీ: భారత కొత్త ఐటీ నిబంధనలను పాటించడానికి గ్లోబల్ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌కు ప్రభుత్వం చివరి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.జూలై 4వ తేదీలోపు కేంద్ర జారీ చేసిన ఆదేశాలను పాటించాల్సి ఉంటుందని, లేకపోతే సంస్థ మధ్యవర్తిత్వ హోదాను కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇదే జరిగితే ట్విటర్‌లో పోస్ట్ అయ్యే అన్ని వ్యాఖ్యలకు కంపెనీయే బాధ్యత వహించాల్సి వస్తుంది.దీనికి సంబంధించి కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులను సంస్థకు ఇచ్చినట్టు సంబంధిత అధికారులు పేర్కోన్నారు. ఇదివరకే కేంద్రం కంటెంట్, ఇతర అంశాలకు సంబంధించి నూతన ఐటీ నిబంధనలను పాటించాలని నోటీసులు ఇచ్చింది. అయితే, ట్విటర్ ఈ ఆదేశాలను బేఖాతరు చేసింది. ఈ నేపథ్యంలోనే బుధవారం మరోసారి ట్విటర్‌కు నోటీసులు ఇచ్చాం.

జూలై 4లోగా ఈ ఆదేశాలను కంపెనీ పాటించాలని, ఇదే చివరి నోటీసు కావడం మూలంగా నిబంధనలను ఉల్లంఘిస్తే ట్విటర్ మధ్యవర్తిత్వ హోదాను కోల్పోతుందని ఐటీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డిజిటల్ మీడియా కంటెంట్ నియంత్రణ కోసం కేంద్రం కొత్తగా ఐటీ నిబంధనలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనలు గతేడాది మే నుంచే అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం, ఆన్‌లైన్‌లో వినియోగదారుల సంఖ్య 50 లక్షలు దాటిని సోషల్ మీడియా కంపెనీలు తప్పనిసరిగా కంప్లైంట్ ఆఫీసర్, నోడల్ అధికారి, మరో ప్రధాన అధికారిని నియమించాలి. వీరు దేశీయంగానే నివసించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ నిబంధనలను అనేక సంస్థలు పాటిస్తున్నప్పటికీ ట్విటర్ దీనికి నిరాకరించింది. కొన్నిటిని పాటించినా, ఇంకా అనేక నిబంధనలు అమలు చేయాల్సి ఉంది.


Next Story

Most Viewed