అనాథలు, అభాగ్యుల‌ కోసం టీటీడీ 'ఆప‌న్నహ‌స్తం'

by Disha Web Desk |
అనాథలు, అభాగ్యుల‌ కోసం టీటీడీ ఆప‌న్నహ‌స్తం
X

దిశ, రాయలసీమ : తిరుప‌తి న‌గ‌రంలో రోడ్లపై సంచ‌రిస్తున్న అనాథ‌ల‌ను, అభాగ్యుల‌ను చేర‌దీసి అంద‌రినీ ఎస్వీ పూర్ హోమ్‌,ఎస్వీ బాల‌మందిరంలో చేర్పించి చ‌క్కటి భ‌విష్యత్తు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాల‌ని టీటీడీ జేఈవో(ఆరోగ్యం,విద్య) స‌దా భార్గవి అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నంలో జేఈవో సోమ‌వారం రామ‌కృష్ణ మిష‌న్‌, ఇస్కాన్ త‌దిత‌ర సంస్థల ప్రతినిధులతో స‌మావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా జేఈవో మాట్లాడుతూ ఈవో డాక్టర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ఆలోచ‌న‌ల మేర‌కు ఈ కార్యక్రమాన్ని చేప‌ట్టామ‌న్నారు. ఎంతోమంది అనాథ‌లు రోడ్లపై తిరుగుతున్నా ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో కుంగి కుశించిపోతున్నార‌ని, వీరికి శ్రీ‌వేంక‌టేశ్వర‌స్వామివారి ఆశీస్సులు అందాల‌ని చెప్పారు. ఇలాంటి వారికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత మేర‌కు స‌హాయం చేస్తున్నార‌ని, అలాంటి సంస్థల‌న్నింటినీ ఒకే తాటిపైకి తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ఎస్వీ స‌ర్వశ్రేయ ట్రస్టు ద్వారా ఇలాంటి సంస్థల‌కు ప‌లు స‌హాయ స‌హ‌కారాలు అందిస్తున్నామ‌ని,చ‌క్కటి సేవ‌లందించే ఇలాంటి సంస్థల‌కు భ‌విష్యత్తులో మ‌రింత స‌హ‌కారం అందిస్తామ‌ని తెలిపారు. ఇందుకోసం ఒక కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని, అవ‌స‌ర‌మైన ప‌క్షంలో ప్రభుత్వ సంస్థలైన ఐసీడీఎస్‌, మున్సిపాలిటీల నుండి స‌హ‌కారం తీసుకుంటామ‌న్నారు.

వీధుల్లో తిరిగే పిల్లల‌కు చ‌క్కటి భ‌విష్యత్తు ఉంటుందని, వారు అనాథ‌లుగా మిగిలిపోకుండా చేర‌దీసి వ‌స‌తి, భోజ‌నం, బ‌ట్టలు అందించి చ‌క్కటి విద్యను అందించ‌డం ద్వారా మంచి భ‌విష్యత్తును క‌ల్పించిన‌ వారిమ‌వుతామ‌ని జేఈవో చెప్పారు. అదేవిధంగా నిరాశ్రయులైన మ‌హిళ‌లు,పురుషుల‌కు ఎస్వీ పూర్‌హోమ్‌లో ఆశ్రయం క‌ల్పించి, వారికి మాన‌సిక వికాసం క‌ల్పించ‌డం ద్వారా స్వామివారి ఆశీస్సులు అందించిన‌ట్టు అవుతుంద‌న్నారు. మొద‌ట‌ తిరుప‌తి న‌గ‌రంతో ప్రారంభించి ఆ త‌రువాత జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభాగ్యుల‌కు ఆప‌న్నహ‌స్తం అందించాల‌ని సూచించారు. ఈ అంశంపై స్వచ్ఛంద సంస్థల‌తో మ‌రో రెండు స‌మావేశాలు నిర్వహిస్తామ‌న్నారు. ఈ సంస్థల నుండి ఒక ప్రతినిధిని ఎంపిక చేసి త‌గిన శిక్షణ ఇచ్చి,వారి ద్వారా అభాగ్యుల‌కు ప్రేమ‌పూర్వక‌మైన సేవ అందించాల‌ని కోరారు.

ఈ స‌మావేశంలో రామ‌కృష్ణ మ‌ఠానికి చెందిన శ్రీ‌దేవి, విశ్వరాజ ఆనంద్, ఇస్కాన్‌కు చెందిన మోహ‌న్ గోవిందదాస్‌, మ‌ధుగోపాల హ‌రిదాస్‌, విద్యాశాఖాధికారి గోవింద‌రాజ‌న్‌, డిప్యూటీ ఈవో రామారావు, ఎస్వీ పూర్ హోమ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ డాక్టర్ భ‌ర‌త్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed